News

గుజరాత్‌లో కలకలం.. ఇద్దరు మైనర్ బాలికలకు బలవంతపు మతమార్పిడి, వివాహ యత్నం

5views

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలను వివాహం జరిపించడంతో పాటు మతమార్పిడి చేసేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మెహసానా జిల్లాలోని ఉనావాలో ఉన్న దాతర్ బాపు దర్గాలో మూడు రోజుల పాటు బాలికలను నిర్బంధించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి ఒక మౌల్వీ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఇద్దరు బాలికలు పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ఫోన్ లొకేషన్ డేటాను పరిశీలించగా బాలికలు మెహసానా జిల్లాలోని ఉనావాలో ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే ఉనావా స్థానిక పోలీసుల సహకారంతో కోడినార్ పోలీసులు దాతర్ బాపు దర్గాలో తనిఖీలు నిర్వహించి బాలికలను సురక్షితంగా రక్షించారు. దర్గాలో ఉన్న సమయంలో బాలికలు బురఖాలు ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

విచారణలో బాలికలను మూడు రోజుల పాటు అక్కడ నిర్బంధించినట్లు, వారి పేర్లు మార్చడంతో పాటు ఇస్లాం మత విశ్వాస ప్రకటన అయిన కల్మాను చదివించేందుకు బలవంతం చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వారికి వివాహం జరిపించేందుకు, మతం మార్చేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ వ్యవహారంలో అబ్దుల్ హాజీ సంధి, మౌల్వీ ఆసిఫ్ కావలి, షాకిర్ అలియాస్ బబ్లీ అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అబ్దుల్ హాజీ సంధి బాలికలతో పరిచయం పెంచుకుని వారిని ఉనావాకు తీసుకెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. మరో నిందితుడు నసీద్ ఖాజీ పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మైనర్ బాలికలను రక్షించిన పోలీసులు కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.