
గుజరాత్లోని ప్రసిద్ధ సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్ర పరిసరాల్లో మాంసాహార విక్రయాలు, వినియోగంపై విధించిన నిషేధానికి సంబంధించి గుజరాత్ హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
సోమనాథ్ ఆలయ పరిసరాల్లో మాంసాహారంపై జిల్లా కలెక్టర్ విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్, నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ నిశా ఠాకూర్ ఈ ఆదేశాలు వెలువరించారు.
అయితే, సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై గుజరాత్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది.
ప్రభుత్వ అప్పీల్పై అత్యవసరంగా స్పందించిన డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ స్టే విధించింది. దీంతో నిషేధాన్ని ఎత్తివేస్తూ వెలువడిన ఆదేశాలు తాత్కాలికంగా అమలులోకి రాకుండా నిలిచిపోయాయి.
కొద్ది గంటల వ్యవధిలోనే హైకోర్టులో చోటుచేసుకున్న ఈ పరిణామాలు సోమనాథ్ ఆలయ పరిసరాల్లో మాంసాహార నిషేధం అంశాన్ని మరోసారి చర్చనీయాంశంగా మార్చాయి.



