News

చెంచుల భక్తికి నిలువెత్తు నిదర్శనం.. రెక్కల కష్టంతో రూ.5 కోట్ల ఆలయం

18views

పేదరికం వారి సంకల్పాన్ని ఆపలేకపోయింది. ఆర్థిక ఇబ్బందులు వారి భక్తికి అడ్డుకాలేదు. కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని స్వామివారి ఆలయ నిర్మాణానికి కేటాయిస్తూ 60 చెంచు కుటుంబాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. కర్నూలు నగరంలోని మూడు సెంట్ల స్థలంలో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో శ్రీ చెంచులక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించేందుకు వారు నడుం బిగించారు.

జమ్మిచెట్టు కింద మొదలైన ఆరాధన
ఎమ్మిగనూరు నుంచి కొన్ని చెంచు కుటుంబాలు 1994లో కర్నూలుకు వలస వచ్చాయి. ఊరూరా తిరుగుతూ కాగితాలు ఏరుకొని అమ్మడం ద్వారా జీవనం సాగించేవారు. ఒక ప్రాంతంలో కొంతకాలం ఉండి మరో ప్రాంతానికి వెళ్లే సంచార జీవితం పిల్లల చదువుకు, కుటుంబాల స్థిరత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితులను మార్చాలని భావించిన చెంచుల పెద్ద ఈరన్న, బళ్లారి చౌరస్తా సమీపంలోని శ్రీనివాసనగర్‌లో కుటుంబాలు స్థిరపడేందుకు ప్రయత్నించారు. స్థానిక సహకారంతో 2004లో సుమారు 2.75 సెంట్ల స్థలాన్ని రూ.36 వేలకు కొనుగోలు చేశారు. అక్కడ జమ్మిచెట్టు కింద వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ఉంచి పూజలు ప్రారంభించారు. అలా మొదలైన ఆరాధన క్రమంగా ఆలయ నిర్మాణ సంకల్పంగా మారింది. 2023 నవంబరు 8న ఆలయానికి భూమిపూజ నిర్వహించారు.

అవహేళనలను అధిగమించి.. సొంతంగా నిర్మాణం
ఆలయ నిర్మాణం కోసం విరాళాలు సేకరించేందుకు ప్రయత్నించినప్పుడు కొందరి నుంచి అవహేళనలు ఎదురయ్యాయని చెంచు కుటుంబాలు తెలిపాయి. దీంతో తమ దేవుడి ఆలయాన్ని తామే నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. యజమానులుగా, ఇంజినీర్లుగా, మేస్త్రీలుగా, కూలీలుగా బాధ్యతలు పంచుకున్నారు. తమకు వీలైన సమయంలో ఆలయ నిర్మాణ పనుల్లో పాల్గొంటూ శ్రమదానంతో స్వామివారికి సేవ చేస్తున్నారు.

పొదుపుతో కోట్ల రూపాయల సమీకరణ
ఆలయ నిర్మాణానికి నిధులు సమకూర్చుకునేందుకు ప్రతి నెలా రూ.10 లక్షల చీటీ నిర్వహించినట్లు సమాచారం. ఇలా 40 నెలలపాటు పొదుపు చేసి సుమారు రూ.4 కోట్ల వరకు సమకూర్చుకున్నారు. అంతేకాదు, 60 కుటుంబాల్లో వివాహాల సందర్భంగా మద్యపానానికి దూరంగా ఉండాలనే నియమాన్ని పెట్టుకున్నారు. మద్యపానానికి ఖర్చు చేసే సుమారు రూ.20 వేల మొత్తాన్ని ఆలయ నిర్మాణానికి విరాళంగా అందించే సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ విధానం ద్వారా దాదాపు రూ.80 లక్షలు సమకూరినట్లు నిర్వాహకులు తెలిపారు.

భక్తి, ఐక్యతకు ప్రతీక
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు సైతం తమ శ్రమను, సంపాదనను సమష్టిగా వినియోగిస్తే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఈ చెంచు కుటుంబాలు నిరూపిస్తున్నాయి. శ్రీనివాసుడిపై భక్తి వారిని ఒక్కటిగా నిలిపింది. తమ పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందించాలనే ఆకాంక్షతో పాటు, తమ ఆరాధ్య దైవానికి ఆలయం నిర్మించాలనే సంకల్పం వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.