
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగేశ్వరాలయంలో కార్తీకమాస పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ శిఖరంపై అర్చకులు ఆకాశదీపాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఒడిశా సంప్రదాయం ప్రకారం ఆశ్వయుజ మాస పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు కార్తీకమాస పూజలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీముఖలింగేశ్వరాలయ శిఖరంపై ఆకాశదీపాన్ని వెలిగించి కార్తీక పౌర్ణమి వరకు కొనసాగించనున్నట్లు అర్చకులు నారాయణమూర్తి తెలిపారు. నెల రోజులపాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించిన అనంతరం ఆలయ శిఖరంపై ఆకాశదీపాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమంలో అర్చకుల సంఘం అధ్యక్షుడు ఎస్.వి. చలం, అర్చకులు సింహాచలం, శ్రీకృష్ణ, శివ, అచ్యుత, అప్పారావు, దేవదాయశాఖ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.





