News

భారతీయ అమెరికన్ల సేవలకు అమెరికా ప్రతినిధుల సభలో గుర్తింపు

33views

వాషింగ్టన్‌: అమెరికా అభివృద్ధిలో భారతీయ అమెరికన్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా భారత సంతతికి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ప్రవేశపెట్టిన ద్వైపాక్షిక తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభలోని 256 మంది సభ్యులు మద్దతు తెలిపారు. ఈ తీర్మానం ద్వారా జులై నెలను భారతీయ-అమెరికన్‌ వారసత్వ మాసంగా గుర్తించేందుకు మార్గం సుగమమవుతుంది.

భారతీయ అమెరికన్లు అమెరికా పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని రాజా కృష్ణమూర్తి పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడే ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను సృష్టించే వ్యాపారాలు, సైనిక, ప్రభుత్వ రంగాల్లో అందిస్తున్న సేవల ద్వారా తరతరాలుగా అమెరికా అభివృద్ధికి వారు విశేషంగా తోడ్పడుతున్నారని తెలిపారు.

వివిధ రంగాల్లో భారతీయ అమెరికన్లు సాధిస్తున్న విజయాలు, సమాజానికి అందిస్తున్న సేవలు అమెరికా ప్రగతిలో వారి భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భారతీయ-అమెరికన్‌ వారసత్వ మాసంగా జులైను గుర్తించడం ద్వారా వారి సేవలను, విజయాలను గౌరవించే అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు.

ఈ తీర్మానానికి లభించిన మద్దతు అమెరికా సమాజంలో భారతీయ అమెరికన్ల పాత్రకు గుర్తింపుగా నిలుస్తోంది.