ArticlesNews

తెలుగునాట శతాబ్దాల క్రైస్తవ విస్తరణ చరిత్ర చివరి భాగం

5views

తెలుగునాట శతాబ్దాల క్రైస్తవ విస్తరణ చరిత్ర – 1వ భాగం

తెలుగునాట శతాబ్దాల క్రైస్తవ విస్తరణ చరిత్ర 2 వ భాగం

హైందవంపై క్రైస్తవ దాడి – చారిత్రక పత్రాలు

క్రైస్తవ మత మార్పిడి భూతం కేవలం ఎస్సీ, బహుజనులనే కాదు, అగ్రవర్ణాలను కూడా వదల్లేదు. రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు సైతం బాప్టిజం తీసుకున్న దాఖలాలు తెలుగుసీమ సామాజిక చరిత్రలో తారసపడతాయి. వలసవాద నాగరికత, అది తీసుకువచ్చిన ఆధునికత, ఈ రెండింటివల్ల చోటు చేసుకున్న సామాజిక పరివర్తన సాంస్కృతిక విధ్వంసానికి దారి తీసింది. ధార్మిక మూలాలపై దాడి చేసింది. సనాతన తత్వాన్ని దూరం చేసింది. వలసవాదం, నాగరికత, ఆధునికత ఈ మూడింటినీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో అధ్యయనం చేస్తే, ప్రాచీనమైన ఆర్షధర్మానికి జరిగిన కీడు తెలుస్తుంది. తెలుగు ప్రాంతాల్లో శతాబ్దాల క్రితమే వేదాధ్యయనం, ధార్మిక సేవ, దేశీయ చింతనకు చాలా కృషి జరిగింది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశంతో పరిస్థితులు తారుమారయ్యాయి.

తెలుగువారు చాలా మంది ఆధునికతను, ఆంగ్లభాషను మైమరచి ఆదరించారు. పనిలో పనిగా క్రైస్తవం అలముకున్నది. మతమార్పిడి ఉధృతమైంది. ఇది నేను చెపుతున్నది కాదు. ‘హిస్టరీ ఆఫ్ తెలుగు క్రిస్టియన్స’పేరిట 1910లో వెలువడిన పుస్తకాన్ని నిశితంగా పరిశీలిస్తే, తెలుగు ప్రాంతాల్లో మతమార్పిడి శతాబ్దాల క్రితమే ఎలా మొదలైందో తెలుస్తుంది. వలస పాలన ఆరంభంలోనే కులవ్యవస్థపై బ్రిటీష్ మేధావులు దృష్టి పెట్టారు.అది మతమార్పిడికి, సామాజిక అంతరాలకు ఉపయోగ పడుతుందని గుర్తించారు. మత మార్పిడికి భారతదేశంలో ఉన్నన్ని అవకాశాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవని తీర్మానించారు. ‘హిస్టరీ ఆఫ్ తెలుగు క్రిష్టియన్స’ పుస్తకంలో ఆద్యంతం ఈ ధోరణి వ్యక్తమవుతుంది. అంతే కాదు, మిషనరీల మతమార్పిడి చర్యలను వ్యతిరేకించిన దాఖలాలను కూడా ఈ పుస్తకం చెప్పకనే చెబుతుంది. ఒకప్పటి దత్తమండలాలుగా పిలిచే ప్రాంతాల్లో సామాజిక వివక్ష ఎదుర్కొన్న కులాలే కాదు, అగ్రవర్ణాలకు చెందిన వారు కూడా వలసపాలకుల మాయలోపడి మతమార్పిడికి సిద్ధపడ్డారు. వితరణశీలత పేరిట జనాకర్షక కార్యక్రమాలు నిర్వహిస్తూ మతమార్పిడికి రంగం సిద్ధం చేశాయి క్రైస్తవ మిషనరీలు. తొలిదశలో రాయలసీమ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రత్యేక కారణాలున్నాయి. వర్షాభావం, దుర్భిక్షం కారణంగా సీమ జన జీవనం కష్టంగా మారిన నేపథ్యంలోనే , మిషనరీలు ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.

1911-12 మధ్య కాలంలో కేవలం 16 నెలల వ్యవధిలో సుమారు 45వేల మంది వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు బాప్టిజం తీసుకున్నట్టు తెలుగు క్రిస్టియన్ల చరిత్ర పుస్తకం చెపుతుంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బళ్లారి మొదలు అనంతపురం జిల్లాలో వేలాది కుటుంబాలు మతం మారాయి. అనంతపురం జిల్లా 1910నాటికే కరవు బారిన పడింది. అప్పటి నుంచి సుమారు వందేళ్ల కరవును అనుభవించింది. ఈ కరవుకాలంలో మిషనరీలు పల్లెలపై కన్నేసి, మతమార్పిడికి పథక రచన చేశాయి. దుర్భిక్ష పరిస్థితులను సువార్త కూటములకు ఆసరాగా మార్చుకున్నాయి. రాయలసీమ ప్రాంతంలోని సుమారు 18 వివిధ సామాజిక వర్గాలే లక్ష్యంగా మతమార్పిడులు చేశాయి. రాయలసీమ జిల్లాల్లో సుమారు 3 లక్షల 40వేల మందిని మతం మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాయి. పత్రికలు ప్రచురించడం, వైద్యసాయం అందించడం వంటి ఎరలు వేసి…ప్రజలను తమ ముగ్గులోకి దింపాయి. క్రైస్తవ మిషనరీలు తొలిదశలో నేరుగా మతమార్పిడి గురించి ప్రస్తావించకుండా వైద్యసాయం చేశాయి. ఈ క్రమంలో విగ్రహారాధనపై ఏవగింపును పెంచేందుకు ప్రయత్నించాయి. 1830 నాటికే తెలుగు ప్రాంతాల్లోకి ప్రవేశించిన మిషనరీలు ముందు సామాజిక అధ్యయనం చేశాయి. వివిధ సామాజిక వర్గాల స్థితిగతులు, ఆర్థిక ఆదాయం, కుల వృత్తులు వంటి అంశాలను నిశితంగా పరిశీలిం చాయి. వాటి వలకు చిక్కే వర్గాలు ఎస్సీ, ఎస్టీలే అని గుర్తించాయి.

మనం ఇప్పటికీ బాగా పరిశీలిస్తే, తెలుగు ప్రాంతాల్లోని కుల వృత్తులకు చెందినవారు మతం మార్చుకున్న దాఖలాలు చాలా అరుదు. కుమ్మరి, కమ్మరి, కురవ, యాదవ, కంసాలి, చాకలి వంటి కులాల్లో మత మారిన దాఖలాలు లేవు. దక్షిణ భారత దేశంలో మతమార్పిడులకు ప్రత్యేక పద్ధతులనే కనిపెట్టేందుకు చాలా శ్రమించాల్సి వచ్చినట్టు Catholic missions in southern India పుస్తకంలో W. Strickland అంటాడు. ‘క్రిస్టియన్ మిషన్స’ పుస్తకంలో T.w.m. మార్షల్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. సామాజిక వర్గాల విభజనను మరింత తీవ్రం చేయడం వల్ల తమ పని సులువు అవుతుందని మిషనరీలు భావించాయి. ఈ ఉద్దేశంతోనే వివక్షను మరింత పెంచేందుకు ప్రయత్నించాయి. సామాజిక విభజనను ఇది మరింత పెంచింది. వివక్షను ఎదుర్కొన్న సామాజికవర్గాలు మిషనరీల ఆకర్షణ మంత్రానికి గురయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయ ప్రధాన కుటుంబాలు, మోతుబరి రైతుల కుటుంబాలు సైతం మతమార్పిడికి ఎందుకు మొగ్గు చూపాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

1699లోనే ‘కర్ణాటక మిషన’ పేరిట కన్నడదేశంలో క్రైస్తవం విస్తరించడం మొదలుపెట్టింది. ఈ ప్రభావమే రాయలసీమపై పడిందంటారు పరిశోధకులు. అనతి కాలంలో కర్ణాటకలో ఒక లక్షా యాభై వేల మంది తమ మతం మార్చుకున్నారని చరిత్ర పుటలు తిరగేస్తే తెలుస్తుంది. కర్ణాటకలో మతమార్పిడులు జరుగుతుండగానే తెలుగు ప్రాంతాలపై మిషనరీలు దృష్టి సారించాయి. అప్పటికే తెలుగువారి జనాభా గురించి ఒక స్పష్టమైన అంచనాకు వచ్చాయి. మొత్తం తెలుగు ప్రాంతాల జనాభా 1710 నాటికి ఒక కోటీ 22 లక్షలుగా మిషనరీలు నిర్ధారించాయి. తమ లక్ష్యా లను చేరుకోవ డానికి మిషనరీలు ఎంత నిర్దిష్టంగా పనిచేశాయో దీన్నిబట్టి తెలుస్తుంది. కర్ణాటక ప్రాంతంలో మిష నరీలు తలపెట్టిన మతమార్పిడి కార్యక్రమానికి బ్రాహ్మణులతో పాటు కులవృత్తులకు చెందిన వారి నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఒకానొక దశలో మిషనరీలకు సంబంధించిన సిబ్బందిపై వెనుకబడిన తరగతులు చెందినవారు దాడి చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి.

తెలంగాణ ప్రాంతంనుంచి గోదావరి దాటి, అటు మహారాష్ట్రలోకి వెళ్లాలని మిషనరీలు చాలా ప్రయత్నాలు చేశాయి. కానీ వాటి ఆటలు సాగలేదు. అందుకే నేటికీ మహారాష్ట్ర ప్రాంతంలో క్రైస్తవ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దాదాపుగా ఉండదని చెప్పాలి. ఎస్సీ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవడంలో మిషనరీలు లక్ష్యాన్ని సాధించాయి. సామాజిక అంతరాన్ని మత ఘర్షణగా మార్చడంలో విజయవంతమయ్యాయి. అయితే సమాజంలోని సంపన్నవర్గాలు ముఖ్యంగా మోతుబరి రైతు కుటుంబాలు సైతం తమవైపు ఆకర్షితులు కావడంతో మిషనరీలు సంతోషించాయి. ఈ విషయాన్ని హిస్టరీ ఆఫ్ తెలుగు క్రిస్టియన్స్ పుస్తకంలో చూడొచ్చు. ముఖ్యంగా కడప జిల్లా నుంచి అటు పైకి పెన్నా తీరంలోని ప్రాంతంలో, దక్షిణ కోస్తా ప్రాంతంలోకి మిషనరీలు ప్రవేశించిన తర్వాత రెడ్డి, నాయుడు సామాజిక వర్గాలకు చెందినవారు బాప్టిజం తీసుకున్నారు. ఈ పరిణామానికి మూలమేంటనేది ఇప్పటికీ అంతుబట్టని విషయం. ముఖ్యంగా వెలనాటి రెడ్లు బాప్టిజం తీసుకున్నట్టు తెలుగు క్రిస్టియన్ల చరిత్ర చదివితే తెలుస్తుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని పెద్ద ఆరికట్ల ప్రాంతంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు తొలిదశలో క్రైస్తవాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది.