News

ఎక్కువ కేసులు అక్కడివే

653views

దేశంలో నమోదైన 30 శాతం కేసులు ఒక్క ప్రదేశానికి సంబంధించినవేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తబ్లిగీ జమాత్‌ సమ్మేళనం పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఈ విషయం పేర్కొంది. మొత్తం 17 రాష్ట్రాల్లో 1023 పాజిటివ్‌ కేసులు తబ్లిగీ జమాత్‌కు సంబంధం ఉన్నవేనని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. సుమారు 22 వేల మంది తబ్లిగీ జమాత్‌ సభ్యులు క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు. 17 రాష్ట్రాల్లోనూ కాంటాక్ట్‌ కేసుల ట్రేసింగ్‌ ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు.

శుక్రవారం నుంచి ఇప్పటి వరకు 601 పాజిటివ్‌ కేసులు నమోదయయ్యియని లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఇప్పటివరకు దేశంలో 2902 కేసులు, 12 మరణాలు చోటుచేసుకున్నట్టు వివరించారు. మొత్తం కరోనా బాధితుల్లో 58 మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. వారు కేరళ, మధ్యప్రదేశ్‌, దిల్లీలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో కేసుల వ్యాప్తి సంఖ్య తక్కువగా ఉందన్నారు. పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని, అదే సమయంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇంట్లో నుంచి బయటికి వచ్చే ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించే రావాలని, ఇంట్లో తయారు చేసుకునే మాస్కులు ధరిస్తే మంచిదని సూచించారు. ఆరోగ్యం బాగాలేని వారే మెడికల్ మాస్కులు వాడాలన్నారు. కొవిడ్‌-19 పరీక్షలను మరింత వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా బాధితుల్లో 0-20 మధ్య వయసున్న వారు 9 శాతం; 21-40 మధ్య గల వారు 42 శాతం; 41-60 మధ్య గల వారు 33 శాతం; 60 ఏళ్లు పైబడిన వారు 17 శాతం మంది ఉన్నారని వయసుల వారీ గణంకాలను లవ్‌ అగర్వాల్‌ మీడియాకు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.