
(సిఖ్ఖుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్‌సాహిబ్‌ను హర్‌మందిర్‌లో ప్రతిష్ఠించిన పర్వదినం)
సాధుసంతుల భూమి అయిన భారతదేశం ప్రపంచానికి అద్భుతమైన, అనంతమైన సాహిత్యాన్ని అందించింది. ఆ క్రమంలోనిదే సిఖ్ఖుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్‌సాహిబ్. ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యంలో అత్యాధునికమైనదీ, అయినా విశ్వజనీన భావనలు కలిగినదీ ఆ గ్రంథం. అది కేవలం సిఖ్ఖుల మతగ్రంథం మాత్రమే కాదు, మానవత్వానికి మార్గదర్శి, భగవంతుడు, మోక్షం, నైతికత, జీవన కళ వంటి అంశాల గురించి జ్ఞానాన్ని పంచే మహత్తర బోధన.
సిఖ్ఖు సంప్రదాయంలో ఐదవ గురువు అయిన గురు అర్జన్‌దేవ్, గురుగ్రంథ్‌సాహిబ్‌ను సంకలనం చేసి అమృత్‌సర్ నగరంలో స్వర్ణమందిరంగా ప్రఖ్యాతి గాంచిన హర్‌మందిర్ సాహిబ్‌లో ప్రతిష్ఠించారు. 1604 సంవత్సరంలో సిఖ్ఖుల కాలమానం ప్రకారం భాద్రపద అమావాస్య అంటే తెలుగు కాలమానం ప్రకారం శ్రావణ అమావాస్య రోజున ఆ ప్రతిష్ఠ జరిగింది. అందుకే ఆ రోజును శ్రీగురుగ్రంథ్‌సాహిబ్ ప్రకాశ్ ఉత్సవ్ అనే పండుగగా సిఖ్ఖులు జరుపుకుంటారు. సిఖ్ఖు మతంలో దేవుడు ఒక్కడే. ఆయన నిరాకారుడు. దైవానికి బదులు గురువుల వాణి అయిన గురుగ్రంథ్‌సాహిబ్‌ను పరమ పవిత్రంగా పూజిస్తారు, పఠిస్తారు.
గురుగ్రంథ్‌సాహిబ్ కేవలం మతగ్రంథం కాదు. అది విశ్వమానవ సౌభ్రాతృత్వాన్నీ, ఆధ్యాత్మిక ఏకత్వాన్నీ చాటుతుంది. అందులో సిఖ్ఖు గురువుల బోధనలు మాత్రమే కాకుండా భారతదేశంలోని ప్రఖ్యాత సాధుసంతుల ప్రవచనాలు ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన నామదేవుడు, రామానంద… బెంగాల్‌కు చెందిన జయదేవుడు… గుజరాత్‌కు చెందిన త్రిలోచన్…. రాజస్థాన్‌కు చెందిన ధన్నా… సింధ్ ప్రాంతానికి చెందిన సాధన తదితరుల బోధనలు గురుగ్రంథ్‌సాహిబ్‌ను అలంకరించాయి. కబీర్, రవిదాస్, షేక్ ఫరీద్… ఇలా మొత్తం 36మంది సాధుసంతులు, గురువుల బోధనల సంకలనమే గురుగ్రంథ్‌సాహిబ్. భారతదేశపు వైవిధ్యభరితమైన ఆధ్యాత్మిక స్వరాలను సమైక్య స్వరంలో వినిపించాలనే దార్శనికతతో గురు అర్జన్‌దేవ్ ఆ గ్రంథాన్ని ఆ విధంగా తీర్చిదిద్దారు.
సిఖ్ఖుల పరమపవిత్ర గ్రంథం రూపొందిన వేళ భారతదేశం సంక్షుభిత పరిస్థితుల్లో ఉంది. బాబర్ ఆక్రమణ, లోడీ – మొగలు పరిపాలకుల అణచివేత ధోరణులతో భారత సమాజం చితికిపోయింది. అంతులేని హింస, బలవంతపు మతమార్పిడులు, ఇస్లామేతర మతాలపై భారీ పన్నులతో సమాజం ముక్కలుచెక్కలైపోయి ఉంది. సిఖ్ఖుమత స్థాపకుడు, మొదటి సిఖ్ఖు గురువు అయిన నానక్, తాను ప్రత్యక్షంగా చూసిన విధ్వంసాలకు సాక్షిగా నిలిచారు, వాటినే శ్లోకాలుగా మలచారు. వాటిద్వారా పాలకుల క్రూరత్వాన్ని, ధర్మ పతనాన్ని, సామాన్య ప్రజల కష్టాలనూ ఖండించారు. సత్యం, సహానుభూతి, న్యాయం అనే మార్గంలో పయనించాలని సమాజానికి పిలుపునిచ్చారు.
గురుగ్రంథ్‌సాహిబ్ కేవలం ఒక సంకలనం కాదు. ఆధ్యాత్మిక చైతన్యం కలిగించే దారిదీపం. సమాజాన్ని వర్గాలుగా విభజించే, ఆచారాలకు పరిమితం చేసే పద్ధతులను నిరసించిన దివిటీ. సమానత్వం, నిరాడంబరత, సేవాభావాలను ప్రోత్సహించిన ఆదిగ్రంథం. అందరికీ ఆదర్శగ్రంథం.





