News

‘X’ ఖాతా ద్వారా హిందూ దేవతలను అవమానించిన నిషు ఆజాద్

4views

న్యూఢిల్లీ: జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మైనర్‌ బాలిక తన ‘ఎక్స్‌’ ఖాతాలో హిందూ దేవతలు, మత విశ్వాసాలను అవమానించేలా పోస్టులు పెట్టిందంటూ సుప్రీంకోర్టు న్యాయవాది అమితా సచ్‌దేవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక నిషు ఆజాద్ తండ్రి సంజయ్‌ ఆజాద్‌పై కూడా ఫిర్యాదులో ఆరోపణలు చేసినట్లు సమాచారం.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. బాలిక ‘ఎక్స్‌’ ఖాతా నుంచి శివుడు, శ్రీకృష్ణుడు, సరస్వతీ దేవి, దుర్గాదేవిపై కించపరిచే వ్యాఖ్యలతో కూడిన పోస్టులు చేసినట్లు న్యాయవాది ఆరోపించారు. సెప్టెంబర్‌ 2023 నుంచి ఆగస్టు 2026 మధ్య నాలుగు పోస్టులు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మతపరమైన మనోభావాలు దెబ్బతీశాయని ఆరోపణ
తాను హిందూ మహిళనని, హిందూ మతాన్ని విశ్వసిస్తానని న్యాయవాది అమితా సచ్‌దేవా ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘ఎక్స్‌’లో బహిరంగంగా అందుబాటులో ఉన్న కొన్ని పోస్టులను తాను గమనించానని, అవి తనతో పాటు ఇతర హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపించారు. పోస్టులు ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో చేసినవిగా ఉన్నాయని ఆమె పేర్కొన్నట్లు ఫిర్యాదులో ఉంది.

ఈ వ్యవహారంపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని న్యాయవాది పోలీసులను కోరారు. IPCలోని సెక్షన్లు 299, 196తో పాటు సమాచార సాంకేతిక చట్టం-2000లోని సంబంధిత నిబంధనలను వర్తింపజేయాలని ఆమె ఫిర్యాదులో కోరినట్లు తెలుస్తోంది.