
కర్నూలు జిల్లా దేవనకొండ పల్లెదొడ్డి గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించనున్న మారెమ్మవ్వ ఆలయానికి గ్రామస్థుల ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా భూమిపూజ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా గ్రామస్థులంతా ఐకమత్యంతో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రానున్న ఆరు నెలల్లో ఆలయ గర్భగుడి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గద్దరాల మారెమ్మ, దేవరలో పల్లెదొడ్డి బోనాలు రెండేళ్లకోసారి నిర్వహించే ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. దేవరలో మారెమ్మవ్వకు సంబంధించిన ప్రధాన ఘట్టం కూడా అత్యంత విశిష్టంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పల్లెదొడ్డి గ్రామస్థులు నూతన ఆలయ నిర్మాణానికి పూనుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఏడాది జూన్ 5న తొమ్మిది మంది సభ్యులతో గద్దరాళ్ల పాలకవర్గాన్ని ఏర్పాటు చేయగా, అందులో పల్లెదొడ్డి గ్రామస్థులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో ఇరువర్గాల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని గ్రామస్థులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పల్లెదొడ్డి గ్రామస్థులు ప్రత్యేకంగా మారెమ్మవ్వ నూతన ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.
గ్రామస్థుల ఐకమత్యంతో ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి, భక్తులకు మరింత సౌకర్యవంతంగా అమ్మవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు వారు తెలిపారు.




