News

రామ మందిర నిర్వహణ అద్భుతంగా సాగుతోంది: కొత్త సీఈవో జితేంద్ర మిశ్రా

28views

 

అయోధ్య: అయోధ్య రామ మందిర నిర్వహణ ఇప్పటివరకు అత్యంత అద్భుతంగా సాగిందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొత్త సీఈవో, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా అన్నారు. అక్కడక్కడా ఎదురైన చిన్నపాటి సమస్యలు మినహా ఆలయ నిర్వహణ, పరిపాలనలో ఎలాంటి పెద్ద ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని, వాటి ఫలితం ఏమిటో వేచి చూడాల్సి ఉందని తెలిపారు.

‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత వైమానిక దళం వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు నాయకత్వం వహించిన ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలి సీఈవోగా నియమించింది. రామ మందిర నిర్వహణ, పరిపాలనా వ్యవహారాలను మరింత సమర్థంగా పర్యవేక్షించేందుకు ట్రస్ట్ ఈ కొత్త పదవిని ఏర్పాటు చేసింది.

నియామకం అనంతరం జాతీయ మీడియాతో మాట్లాడిన జితేంద్ర మిశ్రా.. ఇప్పటివరకు ఆలయ నిర్వహణ, పరిపాలన చాలా బాగా సాగిందని ప్రశంసించారు. సీఈవోగా తన పాత్ర, బాధ్యతలపై ఇప్పటికే అవగాహన కల్పించుకున్నానని తెలిపారు. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.

శ్రీరాముడి ఆశీస్సులు, ట్రస్ట్ మార్గదర్శకత్వం, తన బృందం సహకారంతో తనపై ఉంచిన బాధ్యతలకు న్యాయం చేయగలననే నమ్మకం ఉందని మిశ్రా పేర్కొన్నారు.

కీలక సమయంలో నియామకం

62 ఏళ్ల జితేంద్ర మిశ్రా నియామకం రామ మందిర విరాళాల వ్యవహారంపై ఆరోపణలు, దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో చోటుచేసుకుంది. ఆలయ విరాళాల సొమ్ము దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణల కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు.

సీఈవో పదవికి ట్రస్ట్‌కు మొత్తం 5,585 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో తుది దశకు ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి, చివరకు జితేంద్ర మిశ్రాను తొలి సీఈవోగా నియమించారు.

నాయకత్వ సామర్థ్యం, నిర్వహణ నైపుణ్యం, నిజాయితీ, భవిష్యత్ దృక్పథం తదితర అంశాలను పరిశీలించిన అనంతరం అత్యంత అర్హత కలిగిన ముగ్గురు నిపుణులను సిఫారసు చేసినట్లు కమిటీ కార్యదర్శి సమీర్ పాండా తెలిపారు.

ఏఐ ఆధారిత స్క్రీనింగ్‌తో ఎంపిక

సీఈవో ఎంపిక ప్రక్రియలో తొలుత ఏఐ ఆధారిత స్క్రీనింగ్ నిర్వహించారు. అనంతరం మాన్యువల్ మూల్యాంకనం చేపట్టారు. మొత్తం 5,585 మంది దరఖాస్తుదారుల్లో 3,577 మంది 600 మార్కుల మూల్యాంకన విధానంలో తమ వివరాలను సమర్పించారు.

వారిలో కనీసం 470 మార్కులు సాధించిన 108 మందిని తదుపరి దశకు ఎంపిక చేశారు. అనంతరం వారితో వర్చువల్ ఇంటరాక్షన్స్ నిర్వహించారు. చివరగా 16 మంది అభ్యర్థులను అయోధ్యకు పిలిపించి ఆగస్టు 11, 12 తేదీల్లో వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఇంటర్వ్యూల అనంతరం ముగ్గురిని తుది జాబితాకు ఎంపిక చేయగా.. వారిలో జితేంద్ర మిశ్రాను తొలి సీఈవోగా నియమించారు. విరాళాల సొమ్ము దుర్వినియోగం ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ నిర్వహించిన మూడో సమావేశంలో ఈ నియామకాన్ని ప్రకటించారు.