News

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభం

0views

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమితి గౌరవాధ్యక్షుడు గోకరాజు గంగరాజు తెలిపారు.

విజయవాడ గాంధీనగర్‌లోని హోమ్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి నూతన కేంద్ర కార్యాలయాన్ని సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని ఆంజనేయులుతో కలిసి గోకరాజు గంగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం గోకరాజు గంగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శ్రీ వినాయక స్వామి ఉత్సవాలను భక్తిభావంతో, సంప్రదాయబద్ధంగా, అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ నిర్వహించేందుకు సమితి కృషి చేస్తుందని తెలిపారు. నూతన కేంద్ర కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలకు సమన్వయ కేంద్రంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, భక్తులకు అవసరమైన సమాచారం, వివిధ ప్రాంతాల ఉత్సవ కమిటీల మధ్య సమన్వయం వంటి అంశాల్లో ఈ కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సమితి ప్రతినిధులు కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి నాగలింగం శివాజీ, పాకాల త్రినాథ్, దుర్గాప్రసాద్ రాజు, శ్రీనివాసరెడ్డి, రంగప్రసాద్, త్రిమూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు.