News

ఎస్‌–400ల కోసం పాక్‌ వేగుల్ని నియమించింది!

8views

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సింధూర్‌లో భారత రక్షణ వ్యవస్థ ఎంత పటిష్ఠంగా పనిచేసిందో విశ్రాంత ఎయిర్‌మార్షల్‌ జితేంద్ర మిశ్రా వెల్లడించారు. ముఖ్యంగా భారత వాయుసేనకు అద్భుతమైన రక్షణ కవచంగా నిలిచిన ఎస్‌–400 వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్థాన్‌ ప్రత్యేక గూఢచారులు, స్లీపర్‌ సెల్‌ల సాయంతో ప్రయత్నించిందని ఆయన తెలిపారు.

ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జితేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ఎస్‌–400 రక్షణ వ్యవస్థల కారణంగానే పాకిస్థాన్‌ ఫైటర్‌ జెట్లు భారత సరిహద్దులకు 200 కిలోమీటర్ల దూరంలోకి కూడా రాలేకపోయాయని పేర్కొన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌లో ఎస్‌–400లు అత్యంత సమర్థంగా పనిచేశాయని చెప్పారు.

పాకిస్థాన్‌లోని సర్గోదా నుంచి నింగిలోకి ఎగిరిన అవాక్‌ (AWACS) రాడార్‌ విమానాన్ని ఏకంగా 314 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి కూల్చివేసినట్లు మిశ్రా తెలిపారు. అంత దూరంలో ఉన్న విమానాన్ని కూల్చడం సైనిక చరిత్రలోనే ఒక రికార్డు అని ఆయన పేర్కొన్నారు. దీంతో భారత రక్షణ వ్యవస్థల సామర్థ్యం ప్రపంచానికి మరోసారి స్పష్టమైందని చెప్పొచ్చు.

ఆపరేషన్‌ సింధూర్‌లో భారత వాయుసేన మొదట పాకిస్థాన్‌ గ్రౌండ్‌ రాడార్లు, కమాండ్‌–అండ్‌–కంట్రోల్‌ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసిందని మిశ్రా వివరించారు. ఫలితంగా పాక్‌ సైన్యానికి గగనతల పరిస్థితులపై కీలక సమాచారం అందకుండా పోయిందన్నారు.

ఆ తర్వాత పాకిస్థాన్‌ రాడార్‌ విమానాలపై ఆధారపడాల్సి వచ్చిందని, అయితే ఎస్‌–400 వ్యవస్థలు వాటినీ సమర్థంగా ఎదుర్కోవడంతో భారత దళాలకు ఆధిపత్యం మరింత పెరిగిందని తెలిపారు. అత్యాధునిక రక్షణ వ్యవస్థలు, ఖచ్చితమైన దాడులు, సమర్థవంతమైన ఆపరేషనల్‌ వ్యూహంతో భారత్‌ పాకిస్థాన్‌పై పైచేయి సాధించిందని ఆయన వివరించారు.

ఈ ఆపరేషన్‌లో భారత మహిళా ఫైటర్‌ పైలట్లు కూడా ఒకటి కంటే ఎక్కువ మిషన్లలో పాల్గొన్నారని జితేంద్ర మిశ్రా తెలిపారు. మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కేంద్రంతో పాటు పాక్‌ వైమానిక స్థావరాలు, కమాండ్‌–అండ్‌–కంట్రోల్‌ కేంద్రాలను ధ్వంసం చేయడంలో వారు కీలకపాత్ర పోషించారని చెప్పారు.

పహల్‌గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ గత ఏడాది మేలో ఆపరేషన్‌ సింధూర్‌ను చేపట్టింది. ఉగ్రవాద మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్న ఈ ఆపరేషన్‌లో భారత్‌ నూర్‌ ఖాన్‌, భోలారి సహా 11 కీలక మిలిటరీ స్టేషన్లను ధ్వంసం చేసిన అనంతరం పాకిస్థాన్‌ కాల్పుల విరమణకు అభ్యర్థించిన విషయం తెలిసిందే.

ఆపరేషన్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదని మిశ్రా స్పష్టం చేశారు. అయితే పౌర నష్టాలను నివారించాలని, ఉగ్రవాదులు, వారి హ్యాండ్లర్లనే లక్ష్యంగా చేసుకోవాలని స్పష్టమైన సూచనలు అందాయని తెలిపారు.

భారత్‌–రష్యాల మధ్య 2018లో కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా ఎస్‌–400 వ్యవస్థలు భారత్‌కు అందుబాటులోకి వచ్చాయి. ఆపరేషన్‌ సింధూర్‌లో వాటి పనితీరు భారత గగనతల రక్షణ సామర్థ్యానికి ఒక కీలక ఉదాహరణగా నిలిచిందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి.