ఒకప్పుడు కుటుంబ అవసరాల కోసం వ్యవసాయం, కూలీ పనులపైనే ఆధారపడిన ఓ మహిళ- ఇప్పుడు అదే గ్రామీణ ప్రాంతంలోని వేలాది మంది మహిళలకు స్వయం ఉపాధి మార్గం చూపిస్తున్నారు. ఏదైనా సాధించాలనే పట్టుదల, దానికి తగిన శ్రమ తోడైతే పేదరికం ఏ మాత్రం అడ్డు కాదని నిరూపిస్తున్నారు. ప్రకృతి వనరుగా లభించే సాధారణ ఈత ఆకులతో (ఛింద్) బొకేలు (పుష్పగుచ్ఛాలు), రాఖీలు సహా ఇతర ఉత్పత్తులు తయారు చేస్తూ, ఛత్తీస్‌గఢ్ దంతెవాడకు చెందిన రాంబతీ పోడియాం సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దంతెవాడ జోరియంబడం గ్రామానికి చెందిన రాంబతీ – తారా స్వయం సహాయక బృందం ద్వారా మహిళలకు ఛింద్ ఆకులతో ఉత్పత్తులు తయారు చేయడం నేర్పిస్తున్నారు.
కూలీ పని నుంచి వ్యాపారవేత్తగా
రాంబతీ పోడియాం కుటుంబం ఒకప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది. సాంప్రదాయ వ్యవసాయం, దినసరి కూలీ పనుల ద్వారా వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే జీవనం గడిపేవారు. దీనికితోడు ఆమె భర్త తరచూ అనారోగ్యానికి గురికావడంతో రాంబతీపై కుటుంబ భారం మరింత పెరిగింది. అయితే ఇన్ని కష్టాలు ఎదురైనా ఆమె ధైర్యం కోల్పోలేదు. 2020 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిహాన్ పథకం ఆమె జీవితంలో కీలక మలుపుగా మారింది.
ప్రభుత్వ సహాయంతో అప్పుడు తార స్వయం సహాయక సంఘంలో (SHG) చేరిన రాంబతీ, అక్కడ నిర్వహించిన పలు శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే అడవి ఈత (ఛింద్) ఆకులతో ఆకర్షణీయమైన బొకేలు ఎలా తయారుచేయాలో నేర్చుకున్నారు. ఈ ఆకులతో బొకేలు చేయడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడం, చూడటానికి కూడా ఎంతో అందంగా ఉండటంతో మొదట్లో చిన్నగా ప్రారంభించిన ఈ పని, తక్కువ కాలంలోనే ఒక పెద్ద వ్యాపారంగా మారింది.
ఏటా రూ. 6 లక్షల ఆదాయం- వీఐపీలకు స్వాగతం
రాంబతీ తయారు చేసిన బొకేలకు స్థానికంగా మంచి డిమాండ్ ఏర్పడింది. ఒక్కో బొకే ధర సుమారు రూ. 80 నుంచి రూ. 120 మధ్య ఉంటుంది. ఇలా ఏడాదికి సుమారు 3 వేలకుపైగా బొకేలను విక్రయిస్తున్నారు. గతేడాది సంవత్సరం వ్యవధిలోనే రాంబతీ బృందం రూ. 6 లక్షలకుపైగా విలువైన బొకేల్ని విక్రయించింది. దంతెవాడలో నిర్వహించిన 3 రోజుల ‘బస్తర్ పండుమ్’ ఉత్సవంలోనే ఏకంగా రూ. 3 లక్షల వ్యాపారం చేయడం విశేషం. ఇప్పటివరకు రాంబతీ తమ స్వయం సహాయక సంఘం ద్వారా రూ. 35 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు ఆదాయాన్ని పొందింది. ఈ సొంత సంపాదనతో ఆమె కొంత స్థలాన్ని కూడా కొనుగోలు చేయడం విశేషం.
ఈ ఆకుల బొకేలకు విశేష ప్రాధాన్యం ఉంది. రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి సహా ఇతర ప్రముఖులు ఎప్పుడైనా దంతెవాడ పర్యటనకు వచ్చిన సమయంలో- రాంబతీ బృందం తయారు చేసిన బొకేలతోనే స్వాగతం పలుకుతారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ దంతెవాడకు వచ్చినప్పుడు కూడా వీరు తయారు చేసిన ఛింద్ బొకేతోనే స్వాగతం లభించింది. ఇక రాంబతీ తన వ్యాపారాన్ని కేవలం ఒక్క బొకేల తయారీకే పరిమితం చేయలేదు. ఏడాది పొడవునా ఆదాయం వచ్చేలా మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తుల్ని మారుస్తున్నారు.
పండగలకు తగ్గట్లు విభిన్న ఉత్పత్తులు
రక్షా బంధన్ పండగ సమయంలో ఈత ఆకులతో పర్యావరణహిత రాఖీలు తయారు చేసి విక్రయిస్తున్నారు. హోలీ పండగ కోసం రసాయనాలు లేని సహజసిద్ధమైన హెర్బల్ గులాల్ (రంగుల పొడి) తయారు చేస్తున్నారు. ఇంకా మౌవా (ఇప్పపువ్వు), తునికి ఆకులు (టెందు), సాల్ గింజల వ్యాపారం కూడా చేస్తూ తమ సంఘంలోని మహిళలకు ఎప్పుడూ ఉపాధి ఉండేలా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ బొకేలను దంతెవాడతో పాటు సుక్మా, జగదల్‌పూర్, బీజాపూర్ వంటి పక్క జిల్లాలకు కూడా సప్లై చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ ఉత్పత్తులన్నింటినీ ఒక ప్రత్యేక బ్రాండ్ పేరుతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మార్కెట్లోకి తీసుకురావాలని రాంబతీ యోచిస్తున్నారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదేదీ లేదని నిరూపిస్తూ వేలాది మంది గ్రామీణ మహిళలకు రాంబతీ ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు.





