
శ్రీశైల దేవస్థానం పరిధిలోని సిద్దవటంలోని శ్రీ కామాక్షి సిద్దవటేశ్వరస్వామి ఆలయంలో పురాతన కాలం నాటి రాగి నాణేలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలోని పాత ధ్వజస్తంభాన్ని తొలగించే పనుల్లో భాగంగా సోమవారం ఇవి బయటపడ్డాయి.
ఆలయంలో పురాతన కాలంలో ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం కాలక్రమంలో దెబ్బతిని శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని తొలగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో శ్రీశైల దేవస్థానం వేదపండితులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ధ్వజస్తంభం తొలగింపు పనులు చేపట్టారు.
ధ్వజస్తంభం అడుగు భాగాన్ని తొలగిస్తుండగా సుమారు 47 రాగి నాణేలు, ఒక అంగుళం పరిమాణంలో ఉన్న పాదరక్ష ఆకారపు వస్తువు, మరో రాగి ముద్ద బయటపడినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.వెలుగులోకి వచ్చిన వస్తువులను వేదపండితులు కార్తిక్‌శర్మ, శివరామశర్మ, ప్రవీణ్‌శర్మ, ఏఎస్‌ఐ సుబ్బరామచంద్ర పరిశీలించారు.
స్తంభాల అడుగున నాణేలు ఉంచే సంప్రదాయం
ఆలయాల్లో నూతన ధ్వజస్తంభాలను ప్రతిష్ఠించే సమయంలో సంప్రదాయబద్ధంగా స్తంభం అడుగు భాగంలో రాగి నాణేలు తదితర వస్తువులను ఉంచే ఆనవాయితీ ఉందని వేదపండితులు తెలిపారు. ప్రస్తుతం లభించిన నాణేలు కూడా అదే సంప్రదాయంలో భాగంగా ఉంచి ఉండవచ్చని వారు పేర్కొన్నారు.
బయల్పడిన రాగి నాణేలు, ఇతర వస్తువులను పోలీసుల సమక్షంలో సీజ్ చేసి వేదపండితుల వద్ద భద్రపరిచారు. వాటి కాలం, చారిత్రక ప్రాధాన్యంపై సంబంధిత నిపుణుల పరిశీలనతో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.





