
ఓనమాలు దిద్దే వయసులోనే అసాధారణ జ్ఞాపకశక్తితో ఐదేళ్ల బాలుడు భగవద్గీతలోని 700 శ్లోకాలను ఏకధాటిగా పఠించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లో నివసిస్తున్న శరణ్, శృతి దంపతుల కుమారుడు శ్రీకృత్ ఈ ఘనత సాధించాడు.
అమెరికాలోని డల్లాస్‌లో దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన భగవద్గీత సంపూర్ణ పారాయణ మహాయజ్ఞంలో శ్రీకృత్ మొత్తం 700 శ్లోకాలను నిరాటంకంగా పఠించాడు. అతని ప్రతిభను గుర్తించిన గణపతి సచ్చిదానందస్వామి బంగారు పతకంతో సత్కరించారు.
శ్రీకృత్ ఐదేళ్ల క్రితం యానాంలో జన్మించాడు. అనంతరం తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లాడు. ప్రస్తుతం ఆస్టిన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న శరణ్, శృతి దంపతులు కుమారుడికి చిన్న వయసు నుంచే భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం పట్ల అవగాహన కల్పిస్తూ భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేయించారు.
బాలుడి తాత టీవీఎస్ ప్రకాశరావు గతంలో యానాం జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్‌గా సేవలందించారు. డల్లాస్‌లో జరిగిన ఈ మహాయజ్ఞంలో 18 దేశాల నుంచి వేలాది మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నట్లు శ్రీకృత్ తల్లిదండ్రులు తెలిపారు.
చిన్న వయసులోనే భగవద్గీత సంపూర్ణ పారాయణం చేసి బంగారు పతకం అందుకున్న శ్రీకృత్ ప్రతిభకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.




