
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో, ఆర్‌ఎస్‌ఎస్ సహకారంతో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ప్రారంభించారు.
శిబిరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వైద్యులతో పాటు చికిత్స కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఆయుర్వేద వైద్య విధానం, అందిస్తున్న చికిత్సలు, ఔషధాల నాణ్యత, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులకు ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ, ఆయుర్వేదం భారతీయ వైద్య సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉండటమే కాకుండా ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని ఆయుష్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, చర్మవ్యాధులు, గ్యాస్, అలర్జీలు, మహిళల ఆరోగ్య సమస్యలు, చిన్నారుల అనారోగ్య సమస్యలతో వచ్చిన రోగులను ఆయుర్వేద నిపుణులు పరీక్షించి తగిన వైద్య సలహాలు అందించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అందుబాటులో ఉన్న సుమారు 50 రకాల ఆయుర్వేద ఔషధాలను అవసరమైన రోగులకు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ శిబిరంలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు పాల్గొని వైద్య సేవలు అందించారు.




