
ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులపై అధ్యయనం చేసేందుకు కెన్యా ప్రతినిధుల బృందం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని వెల్లమిల్లి, నాచుగుంట గ్రామాల్లో పర్యటించింది.
ఈ సందర్భంగా బృంద సభ్యులు సమీకృత వ్యవసాయ విధానం, వివిధ రకాల జీవ కషాయాల తయారీ, ఎత్తైన మడుల్లో వరి సాగు, అజోల్లా జీవ ఎరువు తయారీ వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు పరిమి రాజేంద్ర, గద్దె రత్నాజీ ఆయా సాగు విధానాలను వివరించడంతో పాటు, ప్రకృతి వ్యవసాయం ద్వారా లభిస్తున్న ప్రయోజనాలను వివరించారు.
ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా మేనేజర్ వెంకటేశ్ పెట్టుబడి వ్యయం, దిగుబడి, మార్కెటింగ్ అవకాశాలు, రైతులకు లభిస్తున్న ఆర్థిక ప్రయోజనాలను కెన్యా ప్రతినిధులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా వ్యయాన్ని తగ్గించడంతో పాటు భూసారాన్ని పరిరక్షిస్తూ స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించవచ్చని ఆయన తెలిపారు.
బృందంలో సీడ్ సేవర్ నెట్‌వర్క్ సమన్వయకర్త వాంజా మాంజోరోజ్ డేనియల్, స్లో ఫుడ్ సంస్థ అధిపతి జాన్ కరియుకి మ్వాంగి, గ్లోబల్ ఫీల్డ్ నెట్‌వర్క్, సీడ్ సేవర్ నెట్‌వర్క్ ప్రతినిధులు, రైతులు, న్యూయార్క్ యూనివర్సిటీ–అబుదాబి ఇంటర్న్ ప్రసిద్ధ సప్కోటా తదితరులు పాల్గొన్నారు.





