
బాంగ్లాదేశ్ హిందువులపై ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతున్న దాడులు పునరావృతమయ్యాయి. రాజధాని ఢాకాలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి నెలకొన్నాయి. ఉత్తర గాయిబంద జిల్లాలో శ్రీరాధాగోవింద దేవాలయ కమిటీ 81 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రంగంలోకి దిగింది. అయితే, ఉగ్రవాద అనుకూల ఇస్లామిక్ మూకల నుంచి బెదిరింపులు రావడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో గాయిబందాలో జరిగిన ఒక ప్రదర్శనలో దుండగులు శ్రీరాముడి చిత్రపటంపై కాళ్లు పెట్టి అగౌరవపరిచారు.
పలాస్ బరీలో సుమారు రూ.15కోట్ల 60లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఆలయం 80శాతం నిర్మాణం పూర్తి చేసుకుంది. 81 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని, 50 అడుగుల కృష్ణుడి విగ్రహాన్ని, 30 అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సనాతన ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించాలని రాధా గోవింద దేవాలయ కమిటీ చాలా కాలంగా శ్రమిస్తున్నది.
ఈ ఘటనపై హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ మహాజోత్ పిలుపు మేరకు జూన్ 19న వేలాది మంది విద్యార్థులు, హిందూ ప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ ప్రభుత్వం మైనారిటీల రక్షణలో విఫలమైందని నిరసనకారులు మండిపడ్డారు.
నిందితులపై 72 గంటలలోపు చర్యలు తీసుకోక పోతే దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒకవేళ రాముడి విగ్రహ స్థాపనను పునఃప్రారంభించనివ్వకపోతే, బాంగ్లాదేశ్ లోని 64 జిల్లాల్లో ఒక్కొక్కటిగా రామాలయాలను నిర్మిస్తామని హిందూ మహాజోత్ ప్రతిజ్ఞ చేసింది.
పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన రాధాగోవింద దేవాలయ కమిటీ చివరకు ఆలయ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తామని కూడా ప్రకటించింది.
1971లో మొదలైన హిందువుల ఊచకోత నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. బాంగ్లా విముక్తి ఉద్యమ సమయంలో పాకిస్థాన్ సైన్యం, ఇస్లామిక్ మిలీషియా ఉమ్మడిగా హిందువులను అత్యంత దారుణంగా హతమార్చారు. చరిత్ర పొడవునా ఈ హత్యాకాండ దఫదఫాలుగా కొనసాగు తూనే ఉంది. అయోధ్య ఉద్యమ సమయంలో 1992లో బాంగ్లాదేశ్ వ్యాప్తంగా సుమారు 3వేల ఆలయాలు ధ్వంసమయ్యాయి. హిందువులపై దాడులు, ఆస్తుల దహనం యథేచ్ఛగా కొనసాగాయి. 2001లో పెద్ద ఎత్తున దాడులు, ఆస్తుల విధ్వంసం కొనసాగింది. వందల మంది హిందువులు ఈ దాడుల్లో గాయపడ్డారు. 2013-16 మధ్య వందలాది ఆలయాలను ఇస్లామిక్ మూకలు నేలమట్టం చేశాయి. 2021లో దుర్గాపూజ సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం జరిగింది. ఖురాన్‌ను అవమానించారనే అబద్ధపు ప్రచారం నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగాయి. 2024 ఆగస్టులో ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత గడచిన రెండేళ్లుగా హత్యాకాండ కొనసాగుతోంది.
ఈ సందర్భంగా రెండు పుస్తకాలను గుర్తు చేసుకోవాలి. తథాగత్ రాయ్ రాసిన ‘మై పీపుల్ అప్ రూటెడ్’, మరొకటి దీప్ హల్దర్, అవిషేక్ బిస్వాస్ రాసిన ‘బీయింగ్ హిందూ ఇన్ బంగ్లాదేశ్’-అన్ టోల్డ్ స్టోరీ. ఈ రెండు పుస్తకాలు బాంగ్లాదేశ్ హిందువుల దైన్యాన్ని, దాడుల పరంపరను ఎంతో లోచూపుతో చర్చించాయి.
తథాగత్ రాయ్ రాసిన ‘మై పీపుల్ అప్ రూటెడ్’ పుస్తకంలో నాటి ఊచకోత ఉదంతాలను కళ్లకు కట్టినట్టు వివరించారు. ముస్లిం మెజారిటీ ప్రాంతంలో ఒడియా మాట్లాడే హిందువులపై జరిగిన మారణకాండను చదివితే ఎవరికైనా గుండెలు మండిపోతాయి. దేవీ దేవతలు కొలువైన ప్రతి ఇంట్లో మరణమృదంగం మోగింది. సిందూరం పెట్టుకున్న ప్రతి స్త్రీ అత్యాచారానికి గురైంది. హంతకులంతా యువకులు. ముసీం లీగ్ నినాదాలిస్తూ.. మందలు మందలుగా హిందువులపై పడ్డారు. ఓ బెంగాలీ హిందూ కుటుంబం భీతితో పారిపోయేందుకు రైల్వే స్టేషన్‌లో కూర్చున్నది. జిహాద్ మూకలు వీరిని చూడగానే పరిగెత్తుకొచ్చి చుట్టుముట్టాయి. కుటుంబంలోని పదిహేనేళ్ల బాలిక మూకను చూడగానే చేష్టలుడిగి కూర్చున్నది. బాలికను బలవంతంగా లేపి నిలబెట్టి వివస్త్రను చేశారు. పట్టపగలు నడిరోడ్డున అలాంటి స్థితిని ఎదుర్కొన్న బాలిక మానసిక స్థితి ఏమై ఉంటుందో ఊహించుకో వచ్చు.
రాయ్ సాహెబ్ నాగేంద్ర కుమార్ సుర్ 1946 ప్రాంతంలో నౌఖాలీ జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది. పాకిస్థాన్ అనుకూల అల్లర్లు చెలరేగిన సమయంలో ఆయనను ముస్లీంలీగ్ మూకలు అపహరించాయి. మారుమూల ప్రదేశానికి తీసుకెళ్లి….నీ సమాధి నువ్వే తవ్వుకో.. పూడ్చిపెడతా మంటూ ఆదేశించారు. రాయ్ సాహెబ్ ఏమాత్రం భయపడకుండా ‘నన్ను మీరెలాగూ చంపుతున్నప్పుడు మీమాట వినడంలో అర్థం లేదన్నారు. హంతక మూకలు రాయ్ సాహెబ్ మరో హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత దుండగులు ఆయన తల నరికివేశారు. రావు సాహెబ్ కుమారుడు అక్కడి నుంచి పారిపోయి కలకత్తాకు వచ్చాడు. రావు సాహెబ్ కుమారుణ్ని రచయిత తథాగత్ రాయ్ సంప్రదించే నాటి సంఘటనల గురించి వాకబు చేసే ప్రయత్నం చేస్తే…వాటిని గుర్తు చేసుకుంటే వెన్నులో వణుకు పుడుతుందన్నారట.
నౌఖాలీ జిల్లా కరవు బారిన పడిన రోజుల్లో హిందువులు రోజంతా ఆహారం కోసం తిరిగి తిరిగి రాత్రి కాగానే మార్కెట్ ప్రాంతంలోనో లేదో వీధుల్లోనే నిద్రించేవారట. ఉదయం లేచే సరికి కొంతమంది ఆకలిచావుకు గురయ్యేవారట. చనిపోయినవాళ్లు ముస్లింలా హిందువులా అని తనిఖీ చేసిన తర్వాత వారు ముస్లింలు అయితే జనాజా నమాజ్ చేసి ఖననం చేసేవారట. హిందువులైతే వారి శవాలను నదుల్లో చేపలకు, పీతలకు ఆహారంగా వేసి ఆనందించేవారట. తూర్పుబెంగాల్‌లోని డెల్టా ప్రాంతంలో చిన్న వృత్తు చేసుకుంటూ జీవనం సాగించే చాలామంది ముస్లిం మూకలు తమ స్త్రీలను పెళ్లి చేసుకోవడం అనివార్యమనుకునే రోజుల్లో తమ ప్రాణాలకంటే తమ గృహిణుల రక్షణ విషయంలో చాలా భయపడేవారని రచయిత తన పుస్తకంలో రాశారు.
దేశ విభజన సమయంలో బాంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లా 1950లో హిందూ మెజారిటీ జిల్లా. విభజన ఖరారైన తర్వాత ఖుల్నాను పాకిస్థాన్‌కు ఇచ్చి ముస్లింమెజారిటీ జిల్లా అయిన ముర్షీదాబాద్‌ను భారత్ కు అప్పగించారు. ఆ తర్వాత ఖుల్నా జిల్లాలోని హిందువులపై దాడులు మొదలయ్యాయి. ఈ హంతక దాడుల్లో హిందువులంతా చెల్లాచెదురయ్యారు.
నాటి పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకోవడానికి తథాగతా రాయ్ వాస్తవ ఘటనల ఆధారంగా వెలువడిన ‘లొజ్జా’ అనే నవల కథను క్లుప్తంగా ప్రస్తావించారు. వాస్తవ ఘటనల ఆధారంగా రాసిన ఈ నవల ఇతివృత్తమంతా భీతిగొలిపేది. 1952లో ఢాకాలోని లైటన్ మెడికల్ కాలేజీలో సుధామయి సహధ్యాయులందరూ తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. సుధామయి సైతం తన మెడికల్ డిగ్రీ తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు మిత్రులు హెచ్చరిస్తూ ఇది ముస్లింల మాతృభూమి. ఇక్కడ మనకెలాంటి భద్రత ఉండదు. అది గుర్తుంచుకో. లేదంటే తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుందన్నారు.
సుధామయి సహా ఆయన తండ్రి ఈ సూచనను ఖాతరు చేయలేదు. డాక్టర్ పట్టా పుచ్చుకుని మైమెన్ సింగ్ పట్టణానికి సుధామయి వెళ్లిపోయాడు. ఎస్.కే.ఆసుపత్రిలో ఉద్యోగంతో పాటు స్వదేశీ బజార్‌లో ప్రైవేట్ ప్రాక్టీసు ప్రారంభించాడు. బ్రాహ్మణ బరియాకు చెందిన ఓ న్యాయవాది కూతురైన కిరణ్మయిని పెళ్లిచేసుకున్నాడు. అందరూ భారత్ వెళ్లిపోతున్నా సుధామయి మాత్రం బాంగ్లాదేశ్ వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. 1971లో పాకిస్థాన్ సైన్యం దాడి చేసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
ఓ రోజు రాత్రి సుధామయిని ముగ్గురు పాకిస్థానీ సైనికులు బంధించారు. పేరడిగారు. భయం భయంగా సిరాజుద్దీన్ హుస్సేన్ అన్నాడు. తడబాటును గ్రహించిన పాకిస్థానీ సైనికులు ప్యాంటు విప్పమన్నారు. ముస్లిం కాదని గ్రహించిన తర్వాత ఓ కాలు విరిచేశారు. మరో ఇద్దరు సైనికులు డొక్కల్లో తన్నారు. అక్కడి నుంచి లాక్కెళ్లి క్యాంపులో వేశారు. విపరీతంగా కొట్టడంతో పాటు మూత్రం తాగించారు. కల్మా చదవాలని బలవంతపెట్టారు. మతం మార్చుకోవాలంటూ హింసించారు. ఆరేడు రోజుల తర్వాత పాకిస్థానీ సైనికులు సుధామయి పురుషాంగాన్ని కోసేసి, నాలాలోకి విసిరేశారు. క్యాంప్‌లోని మిగతా వాళ్లు ఈ ఘటనను చూసిన తర్వాత తామంతా ముస్లిం మతం స్వీకరిస్తామని పాకిస్థానీ సైనికులను ప్రాధేయపడ్డారు. నిర్దాక్షిణ్యంగా వారందరినీ సైనికులు హత్య చేశారు.
దీప్ హల్దర్, అవిషేక్ బిస్వాస్ రాసిన ‘బీయింగ్ హిందూ ఇన్ బాంగ్లాదేశ్-అన్ టోల్డ్ స్టోరీ’ పుస్తకంలో ఏముందో తెలుసుకుందాం. చరిత్ర భారాన్ని సాంతం ఆర్ధ్రంగా ప్రయాసపడి కుదిస్తే ఎలా ఉంటుందో చెప్పాలంటే ‘బీయింగ్ హిందూ ఇన్ బాంగ్లాదేశ్-అన్ టోల్డ్ స్టోరీ’ పుస్తకం గురించి మాత్రమే చెప్పాలి. ఎనిమిది దశాబ్దాలుగా బాంగ్లాదేశ్ హిందువులు మోస్తున్న గాయాల గతాన్ని తడుముతుందీ పుస్తకం. పుస్తకం వెంటాడే వాక్యాలతో మొదలవుతుంది.
90 ఏళ్ల స్మృతికాంత బిస్వాస్ హిందువుల ఊచకోతలకు ప్రత్యక్ష సాక్షి. ఆయనను ఇంటర్వ్యూ చేశారు రచయితలిద్దరూ. తప్పుడు వార్తలు వ్యాపించగానే పొరుగువారే అల్లరిమూకలుగా, హంతకులుగా మారి హిందులపై నరమేధానికి పాల్పడిన ఉదంతాలను రచయితలు ఎంతో ఆర్ధ్రంగా రాశారు. తనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి సోదరిని అల్లరిమూకల బారినుండి కాపాడేందుకు ఏం చేశారో స్మృతికాంత బిస్వాస్ చెప్పడంతో పుస్తకం ఆరంభమవుతుంది.
ఆ తర్వాత జనాభా నిష్పత్తిలో వచ్చిన తీవ్రమైన మార్పులను పుస్తకం చర్చిస్తుంది. 1947లో ముప్ఫైశాతం హిందు జనాభా ఉంటే 9శాతానికి పడిపొయిన తీరును, సంపన్న హిందువులు సైతం తమ ధార్మిక విశ్వాసాలను వ్యక్తం చేసేందుకు జంకిన గతాన్ని, బెంగాలీ దళిత నాయకుడు జోగేంద్రనాథ్ మండల్ చారిత్రక పాత్రను, దేశ విభజన సమయంలో ముస్లింలీగ్‌ను సమర్థించి తర్వాత పశ్చాత్తాపపడిన తీరును చర్చిస్తుంది.
మొత్తంగా ఎనభై ఏళ్లుగా సాగుతున్న బాంగ్లాదేశ్ హిందువుల ఊచకోతలో చరిత్రకెక్కని హృదయ విదారక గాథలెన్నో ఉన్నాయి. 2021 నుంచి ఆరేళ్లుగా ఇది మరింత తీవ్రమైంది. 2024లో అధికార మార్పిడి తర్వాత దాడుల తీవ్రత పెరిగింది. భారత ప్రభుత్వం బాంగ్లాదేశ్ హిందువుల గురించి అవసరమైన చర్యలు తీసుకోవాలంటే అందుకు సాంకేతికమైన అవరోధాలున్నాయి. వారంతా బాంగ్లాదేశ్ పౌరులు కావడం ప్రథమ అవరోధం. దీన్ని ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రాబోయే రోజుల్లో తిరిగి షేక్ హసీనా ప్రభుత్వం ఏర్పడితే అప్పుడేమైనా బాంగ్లాదేశ్ హిందువులకు ఉపశమనం-ప్రాణాలకు హామీ లభిస్తుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ప్రశాంత్ జోషి
సీనియర్ జర్నలిస్ట్





