
ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని భవ్యమైన శ్రీరామ జన్మభూమి మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాలకు సంబంధించిన అంశంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో, ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ)తో సమగ్ర విచారణ జరపాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాసింది.
శ్రీరామ మందిర విరాళాల పెట్టె నుంచి నిధులు చోరీకి గురయ్యాయంటూ ఇటీవల కొన్ని ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో, ఈ అంశంపై పూర్తి స్థాయి, నిష్పాక్షిక విచారణ నిర్వహించాలని ట్రస్ట్ కోరింది. వాస్తవాలు వెలుగులోకి రావడంతో పాటు, విచారణలో ఎవరైనా దోషులుగా తేలితే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ట్రస్ట్ తన లేఖలో పేర్కొంది.
ఈ ఆరోపణలను అఖిలేష్ యాదవ్ తో పాటు మరికొందరు వ్యక్తులు బహిరంగంగా ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై స్పష్టత తీసుకురావడానికి స్వతంత్ర దర్యాప్తు అవసరమని ట్రస్ట్ అభిప్రాయపడింది.
దేశవ్యాప్తంగా కోట్లాది హిందువుల ఆరాధ్యక్షేత్రంగా నిలిచిన శ్రీరామ జన్మభూమి మందిరానికి సంబంధించిన ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ఎలాంటి అనుమానాలకూ తావు లేకుండా వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడం అవసరమని హిందూ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎస్‌ఐటీ విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చి, ఈ వ్యవహారంపై నెలకొన్న సందేహాలకు తెరపడుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.





