News

విత్తన బంతులతో అటవీ ప్రాంతాల్లో వనాల పెంపు

18views

పచ్చదనం విస్తరణలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అటవీ డివిజన్‌లో విత్తన బంతులతో వనాల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్‌ఓ వై.వి.నరసింహరావు అన్నారు. చింతపల్లి అటవీశాఖ డివిజన్‌ కార్యాలయం ఆవరణలో విత్తన బంతుల తయారీ, వనాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై డివిజన్‌ పరిధిలోని అటవీ ఉద్యోగులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో 15 లక్షల విత్తన బంతులను తయారు చేయగా, చింతపల్లి డివిజన్‌ పరిధిలో ఏడు లక్షలు సిద్ధం చేసినట్టు డీఎఫ్‌ఓ తెలిపారు. గిరిజన ప్రాంతాలకు అనువైన పనస, మామిడి, నేరేడు, చింత, నల్లమద్ది, రావి, మర్రి, గుమ్మడి టేకు, జువ్వి వంటి అనేక రకాల విత్తనాలను క్షేత్రస్థాయిలో అటవీ సిబ్బంది సేకరించారన్నారు. వీటిని బంకమట్టి, ఆవుపేడతో విత్తన బంతులుగా తయారు చేసి అటవీ ప్రాంతాల్లో అడవులు పలుచగా ఉన్న ప్రాంతాల్లో చల్లుతామన్నారు. స్వయం సహాయక సంఘాలు, విద్యార్థుల సాయంతో ఈ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. గ్రీన్‌ క్లైమేట్‌ సంస్థ నిర్వహకులు జె.వి.రత్నం, రేంజి అధికారులు అప్పారావు, వెంకటరావు, అటవీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.