
మత్స్య 6000’ జలాంతర్గామిని ఈ ఏడాది అక్టోబరు- డిసెంబరు మధ్య సముద్రంలోకి పంపనున్నట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్‌ఐవోటీ) డైరెక్టరు బాలాజీ రామకృష్ణన్ తెలిపారు. ఇందులో 500 మీటర్ల లోతుకు మనుషులు వెళ్లి పరిశోధనలు చేస్తారని ‘ఈటీవీ భారత్-తమిళ్’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ వెల్లడించారు. ఈ పరిశోధనలో వచ్చే ఫలితాలను విశ్లేషించి, వచ్చే ఏడాది 6 వేల మీటర్ల లోతుకు వెళ్లేందుకు సిద్ధమవుతామని చెప్పారు. ఖనిజ వనరుల అంచనాకు, సముద్ర సమగ్ర విశ్లేషణ, సాగర గర్భ పర్యాటకంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఈ ప్రయాణం దారి చూపుతుందన్నారు. సముద్ర జీవుల ప్రత్యేక లక్షణాలు, అక్కడి నీటి స్వభావాన్ని తెలుసుకునేందుకూ శాస్త్రవేత్తలకు అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
ముగ్గురిని పంపించేలా ప్రాజెక్టు
సముద్రంలో అన్వేషణ భిన్నంగా ఉంటుందని ఎన్‌ఐఓటీ శాస్త్రవేత్త, మత్స్య 6000 ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణన్ తెలిపారు. ముగ్గురు వ్యక్తులు సముద్రం లోపలికి వెళ్లేలా ఈ ప్రాజెక్టును రూపొందించామని, వారికి ఆక్సిజన్ అందించడానికి 61 ఆక్సిజన్ సిలిండర్లు ఉంటాయని వివరించారు. ఈ ప్రాజెక్టును ఐదేళ్ల క్రితం ప్రారంభించామని గుర్తుచేశారు. జలాంతర్గామిని అందులోని వారే పూర్తిగా నియంత్రిస్తారని, ఈ మేరకు ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఒకేసారి 12 గంటల పాటు పరిశోధనలు జరిపేలా మత్స్యను డిజైన్ చేశామని వివరించారు.





