News

బెంగాల్‌లో గోవధ నిషేధంపై కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన కమ్యూనిస్టు పార్టీ

5views

పశ్చిమ బెంగాల్లో గోవధ నియంత్రణ చట్టం అమలుపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ‘పశ్చిమ బెంగాల్ జంతు వధ నియంత్రణ చట్టం – 1950’ను కఠినంగా అమలు చేయాలని జారీ చేసిన ఉత్తర్వును వ్యతిరేకిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) బెంగాల్ విభాగం కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ చట్టం కింద గోవధపై నిషేధం అమలులోకి వస్తుండటంతో, దీనిని తక్షణమే నిలిపివేయాలని పిటిషన్‌లో కోరినట్లు సమాచారం. కమ్యూనిస్టు పార్టీ వాదన ప్రకారం, ఈ చట్టం ముస్లింల మత స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని, పశుపోషణ ఆధారంగా జీవనం సాగించే రైతుల ఉపాధిని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. అలాగే పౌరుల ఆహార స్వేచ్ఛ, బెంగాల్ ప్రాంతీయ ఆహార సంస్కృతిపై కూడా ఇది ప్రభావం చూపుతుందని వారు అభిప్రాయపడ్డారు.

మరోవైపు హిందూ సంఘాలు, గోరక్షణ వర్గాలు మాత్రం గోవును భారతీయ సంస్కృతిలో పవిత్రంగా భావిస్తారని, గోవధ నియంత్రణ హిందూ సమాజ విశ్వాసాలకు సంబంధించిన అంశమని పేర్కొంటున్నాయి. జంతు సంరక్షణ, గోసంరక్షణ దృష్ట్యా ఈ చట్టం అమలు అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ చట్టాన్ని అమలు చేయడంలో జంతుబలి నియంత్రణ కూడా ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటిగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశం రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారగా, హైకోర్టు విచారణపై అందరి దృష్టి నెలకొంది.