ArticlesNews

భక్తిమార్గం

37views

ముక్తిని పొంది భగవంతుడి చరణసన్నిధికి చేరడానికి భక్తి మార్గమే ముఖ్యమైనదీ సులభమైనదీ అన్నారు పెద్దలు. ఎందరో మహాత్ములు ఆ మార్గాన్ని అనుసరించి పరమాత్మలో ఐక్యమయ్యారు. భక్తికి ఉన్న శక్తి అపారం. నిస్వార్థంగా, నిశ్చలమైన భక్తితో భగవన్నామస్మరణ చేస్తే ముక్తి తప్పక లభిస్తుందని విశ్వాసం.

మహాభారతాన్ని రచించిన తర్వాత వేదవ్యాసుడు విచారంగా ఉండటం గమనించిన నారదమహర్షి కారణమేంటని అడిగాడు. అప్పుడు వ్యాసుడు ‘మానవాళిని ఉద్ధరించడానికి వేదాలలో చెప్పిన ధర్మాలను మహాభారతంలో ఇమిడ్చి, వేదాధ్యయనం చేయలేనివారికి కూడా అర్థమయ్యేలా రాశాను. అయినా ఏదో తెలియని అశాంతి నన్ను వెన్నాడుతోంది. మనశ్శాంతి కలగాలంటే ఏం చేయాలో తెలుప’మని ప్రార్థించాడు. అప్పుడు నారదుడు ‘మహాభారతం ద్వారా నువ్వు మనిషి విధ్యుక్త ధర్మాలను, వాటిని నిర్వర్తించాల్సిన విధాలను తెలియజేశావు. భగవద్గీత ద్వారా ధర్మ, కర్మాల ప్రాధాన్యాన్ని వివరించావు. కానీ భగవంతుడి పట్ల ఉండాల్సిన అనన్యమైన భక్తి గురించి పూర్తిగా తెలుపలేదు, శ్రీమన్నారాయణుడి సంకీర్తన మాహాత్మ్యాన్ని వివరించలేదు. ముక్తిని పొందడానికి, భగవంతుణ్ని చేరడానికి ధర్మాచరణతో పాటుగా భక్తి మార్గాన్ని అనుసరించాలి. కాబట్టి నారాయణుణ్ని కీర్తిస్తూ గానం చెయ్యి. మానవాళికి భగవంతుడి విశ్వరూపాన్ని, భగవదవతార విశేషాలను తెలియజేయి. అనంతుడు, పరమపురుషుడు, ద్వంద్వాతీతుడైన భగవంతుడు ఎలా సర్వజీవులకు ప్రాణాధారంగా ఉన్నాడో వివరించు. భిన్నమైన రూపనామాలతో ఎందుకు భూమిపైన అవతరించి, సామాన్యుడిలా సంచరిస్తున్నాడో తెలియజేసేలా శ్రీమన్నారాయణుడి వైభవాన్ని కీర్తించు. ప్రజలకు నారాయణ కీర్తన ప్రాధాన్యాన్ని స్పష్టంగా వివరించు. భగవంతుణ్ని కీర్తించే పదజాలం సరిగ్గా లేకపోయినా, మధురంగా గానం చేయలేకపోయినా ఆయన అనుగ్రహంలో లోపం ఉండదు! నిరంతరం దైవనామస్మరణ చేయడంవల్ల మనిషి మనసులోని దుష్టబుద్ధులు తొలగిపోయి, సహజమైన సాత్త్విక స్వభావం అగ్నివలె ప్రజ్వలించి, కర్మఫలాన్ని నశింపజేస్తుంది, విముక్తిని ప్రసాదిస్తుంది. హృదయాలలో భగవంతుడిపై భక్తి, ప్రేమలను నిలుపుకొన్న వారి పాపాలన్నీ ప్రక్షాళితమై ముక్తి పొందగలరని తెలియజేయి. అప్పుడు తప్పక నీ మనసుకు శాంతి లభిస్తుంది’ అంటూ వివరించాడు. నారదమహర్షి ఉపదేశాన్ని అనుసరించి వ్యాసుడు భాగవత రచన చేసి మానవాళికి కానుకగా అందించి, మనశ్శాంతిని పొందాడు.

మార్కండేయుడు తనకి పదహారో ఏట మృత్యువు ఉందని తెలుసుకుని, ఘోరతపస్సు చేసి శివుణ్ని ప్రసన్నం చేసుకున్నాడు. ప్రాణాలు హరించడానికి వచ్చిన యముడినుంచి కాపాడమంటూ శివలింగాన్ని కౌగలించుకున్నాడు. అతడి అచంచల భక్తికి మెచ్చిన శివుడు, యమపాశం నుంచి రక్షించి చిరంజీవిగా వరమిచ్చాడు. ఇంకా ధృవుడు, కన్నప్ప, సక్కుబాయి… ఇలా ఎందరో భక్తితో సేవించి, భగవంతుడి పాదపద్మాలను చేరుకున్నారు. నిత్యకర్మలలో ఎంతగా తలమునకలై ఉన్నప్పటికీ, కొంత సమయం భగవన్నామస్మరణకు వెచ్చిస్తేనే మనసుకు శాంతి… జీవితానికి ముక్తి!