
ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన పి.గన్నవరం మండలం లంకలగన్నవరానికి చెందిన డొక్కా సీతమ్మ పేరిట పవిత్ర వారణాసిలో ఆమె స్ఫూర్తితో గోదావరి జిల్లా వాసి డొక్కా సీతమ్మ ఆశ్రమం ఏర్పాటు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని కాపవరం గ్రామానికి చెందిన దండు త్రినాథరాజు అయిదు నెలల క్రితం గంగానది చెంతన హనుమాన్ ఘాట్ వద్ద ఆవాదగర్భి ప్రాంతంలో దీన్ని నెలకొల్పారు. తెలుగు అక్షరాలతో చక్కగా ఆమె పేరున చిరునామాతో బోర్డు ఏర్పాటు చేశారు.
మానవతామూర్తి డొక్కా సీతమ్మ పేరున వారణాసిలో అన్నదానం చేయాలనేది తన సంకల్పంగా ఆయన ‘న్యూస్టుడే’కు తెలిపారు. భక్తులకు తక్కువ అద్దెకు గదులు ఏర్పాటు చేసి ఉచితంగా భోజనం అందించేందుకు సంకల్పించినట్లు వెల్లడించారు.
ఆశ్రమం కోసం విశాలమైన భవనాన్ని రూ.15 లక్షలతో మెరుగులు దిద్దారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్నపూర్ణాదేవి క్షేత్రంలో అపర అన్నపూర్ణ.. అన్నదానానికి స్ఫూర్తిదాత డొక్కా సీతమ్మ పేరున తాను ఈ సంకల్పానికి సిద్ధమైనట్లు ఆయన వివరించారు.





