
తూర్పు ఇంగ్లాండ్ లో 23 ఏళ్ల తుషార్ కుమార్ మేయర్ ఎన్నికల్లో గెలిచి బ్రిటన్ చరిత్రలో మేయర్ పీఠాన్ని అధిరోహించిన అత్యంత పిన్నవయస్కుడైన భారతీయునిగా చరిత్ర సృష్టిం చారు. గతంలో లండన్ లోని కింగ్స్ కాలేజీలో రాజనీతి శాస్త్రం చదువుకుని విద్యను ఒంటబట్టించుకున్న తుషార్ కుమార్ తాజాగా ఎల్ అండ్ బోర్హామ్వుడ్ పట్టణంలో జరిగిన ఎన్నికల్లో గెలిచి మేయర్ గా ఎంపికయ్యారు. మూడేళ్ల క్రితం ఇదే టౌన్ కౌన్సిల్ లో సభ్యునిగా చేరారు. గతంలో డెప్యూటీ మేయర్ గా పనిచేసిన అనుభవాన్నీ గడించారు. ఆదివారం ఫెయిర్వే హాల్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో తుషార్ మాట్లాడారు. “మేయర్ గా గెలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. రాజకీయయాత్రలో నా వెంట నడిచిన, నాకు మద్దతు పలికిన పట్టణ ప్రజలకు సేవచేసి రుణంతీర్చుకుంటా. ప్రజా సేవలో యువతో నిమగ్నమవ్వాలి” అని కోరారు. తుషార్ భారత్ లో పుట్టారు. పదేళ్ల వయసులో ఇతన కుటుంబం బ్రిటన్ కు వచ్చి స్థిరపడింది.





