News

అయోధ్యలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం

6views

అయోధ్యలోని రామాలయానికి వచ్చిన బాంబు బెదిరింపు, దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనతో ఆలయ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. భక్తులు, సందర్శకులు ఆందోళనలో పడిపోయారు. సైబర్ పోలీస్ స్టేషన్లో ఈ విషయంపై ఎఫ్ఎఆర్ నమోదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బెదిరింపు తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి రాముడి ఆలయ ట్రస్టుకు పంపిన లేఖ ద్వారా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి, రామ జన్మభూమి ట్రస్టుకు వచ్చిన ఈ బెదిరింపు మెయిల్, ఆలయ భద్రతను పెంచాలని సూచించింది. ఈ మెయిల్ వచ్చిన వెంటనే, ఆలయ అధికారులు అత్యవసరంగా భద్రతా చర్యలను తీసుకోవాలని నిర్ణయించారు.

అప్రమత్తత, సమన్వయం

ఈ బెదిరింపుల నేపథ్యంలో అయోధ్యలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు. సీఆర్పీఎఫ్, ఎటీఎస్, స్థానిక పోలీసులు సంయుక్తంగా భద్రతా చర్యలను అమలు చేస్తున్నారు. డ్రోన్ జామర్ వ్యవస్థలు, సీసీటీవీ కెమెరాలు, ఇతర ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో అయోధ్యతో పాటు, బారాబంకి, ఇతర పొరుగు జిల్లాలను కూడా హై అలర్ట్లో ఉంచారు. ఈ ఘటనపై స్పందించిన సైబర్ సెల్ ఈ బెదిరింపును తీవ్రంగా తీసుకుంటున్నామని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ భద్రతను పెంచడం, భక్తుల భద్రతను కాపాడడం కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్లు వెల్లడించారు.