
మంగళగిరి శ్రీపానకాలస్వామి కొండపై నుంచి దిగువుకు ప్రత్యామ్నాయంగా మరో ఘాట్‌రోడ్డు నిర్మాణానికి దాతలు ముందుకొచ్చారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన సర్వేను చేపట్టారు. దిగువ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం నుంచి కొండపై ఉన్న పానకాలస్వామి దేవస్థానానికి ఘాట్‌రోడ్డు గతంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆలయానికి వచ్చే భక్తులు సంఖ్య పెరుగుతుండటంతో కింద నుంచి కొండపైకి వెళ్లిన వాహనాలతో పార్కింగ్ నిండిపోతోంది. ఫలితంగా పార్కింగ్‌లో ఉన్న వాహనాలు తిరిగి కిందకి వెళ్లాలంటే అసౌకర్యంగా మారింది. శని, ఆదివారాల్లో భక్తులు భారీగా తరలివస్తున్నారు. కొండపై పార్కింగ్ ఏర్పాటుకు అవసరమైన స్థలం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా పార్కింగ్ ప్రదేశం నుంచి కొండపైకి వచ్చే ఘాట్ రోడ్డు రెండో మలుపు వద్ద కలిసే విధంగా మరో ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించారు. రెండు వందల మీటర్ల రహదారి నిర్మాణం చేపట్టాలని సంకల్పించారు. ఇందుకోసం ఇద్దరు దాతలు ముందుకొచ్చారు. రూ.6 కోట్ల వరకు వెచ్చించేందుకు అంగీకరించడంతో పనులు చేపడుతున్నారు.
కొండ చుట్టూ నిర్మించేలా మరో ప్రతిపాదన
ఇందులో తొలి విడతగా ఘాట్ రోడ్డు కొండపై నుంచి దిగువకు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు నిర్మించాలనే దాని కోసం సర్వే ప్రారంభించారు. దీని నిర్మాణం పూర్తిచేస్తే పార్కింగ్ ప్రదేశంలో ఉన్న వాహనాలు పాత ఘాట్‌రోడ్డులోకి నేరుగా రాకుండా వెనుక నుంచి నూతనంగా నిర్మించే రోడ్డు గుండా బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల కొండపై వాహన రద్దీని నివారించవచ్చని భావిస్తున్నారు. ఇది కాకుండా ‘ప్రసాదం’ పథకం కింద మరో ఘాట్ రోడ్డు నిర్మాణం ప్రతిపాదనలో ఉంది. ఇది ఎయిమ్స్ మార్గం నుంచి కొండ చుట్టూ వచ్చి పానకాలస్వామి ఆలయం వద్దకు చేరుకుంటుంది. దీనికి డీపీఆర్ రూపకల్పన జరుగుతుంది. ఈ రోడ్ల నిర్మాణం వల్ల భవిష్యత్తులో స్వామిని దర్శించుకునే భక్తులు తమ వాహనాల్లో నేరుగా కొండపైకి చేరుకునే సౌలభ్యం కలుగుతుంది. తొలి విడతగా దాతలు నిర్మించే ప్రత్యామ్నాయ ఘాట్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలని దేవాదాయశాఖాధికారులు సంకల్పించారు.





