కర్నూలు జిల్లా, కర్నూలు నగరంలోని అన్నపూర్ణమ్మ విద్యార్థి ఆవాసం 26 వ వార్షికోత్సవం, స్థానిక వివేకానంద స్కూల్లో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహుతుల,అభిమానుల కేరింతలతో, చప్పట్లతో మారు మోగిపోయింది. వసతి గృహ విద్యార్థులు అతిథులను ఘోష్ తో కార్యక్రమ స్థలానికి తోడ్కొని వచ్చారు.
అన్నపూర్ణమ్మ వసతి గృహ అధ్యక్షులు శ్రీ వి. మేఘ శ్యామయ్య సారథ్యంలో, కర్నూలు ఉపరవాణా శాఖ అధికారి శ్రీ వివేకానంద రెడ్డి, చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ శ్రీనివాసులు గుప్తా, ప్రాంత సహ సేవా ప్రముఖ్ శ్రీ కొండారెడ్డి గార్ల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రార్థన, చిన్నారుల భగవద్గీత పఠనం తర్వాత వసతి గృహ కార్యదర్శి శ్రీ కిరణ్ నివేదిక సమర్పించారు. వసతి గృహ చిన్నారుల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది.
సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో సంస్కృత భాష సంభాషణ, నృత్యం, చెక్క భజన, ఏక పాత్రాభినయం, పిరమిడ్ లు, దండ, నియుద్ధ ,యోగ, హాస్యనాటిక, ప్రేరణ గీత్ లాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రధాన వక్త, సహ ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ కొండారెడ్డి మాట్లాడుతూ మనదేశం శ్రేష్ఠమైన భావాలు త్యాగము,సేవ అని, రాష్ట్రీయ సేవ భారతి ద్వారా దేశంలో అందరకీ విద్య, వైద్యము, స్వావలంబన వ్యక్తిలో శక్తిని మేల్కొలిపే విధంగా దేశంలో 1,60,000 సేవ కార్యక్రమలు జరుగుతున్నాయని అందులో ఒకటి ఈ వసతి గృహం ఒకటి అని పేర్కొంటూ సేవా భారతి ద్వారా జరుగుతున్న అనేక సేవా కార్యక్రమాలను గూర్చి వివరించారు.
ప్రతి తల్లీ తండ్రి సమాజంలో పొంచి ఉన్న పాషాండ శక్తుల బారిన పడకుండా తమ పిల్లలను కాపాడుకుంటూ సర్వశ్రేష్ఠంగా ఎదిగేలా కృషిచేసి సుదృఢమైన హైందవ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్రిక్కిరిసిన సభా ప్రాంగణంలో విభాగ్ సేవా ప్రముఖ్ శ్రీ లింగం శ్రీనివాస్ జిల్లాలో జరుగుతున్న సేవ కార్యక్రమాలు, సంస్థల గూర్చి ప్రస్థావన చేశారు. కర్నూలు ప్రాంత వదాన్యులు తమ ప్రోత్సాహాన్ని ఇలాగే కొనసాగించాలని, కార్యకర్తలు ద్విగుణీకృతోత్సాహంతో వినూత్న సేవా ప్రకల్పాలతో కొనసాగుతూ పటిష్ట సామాజిక నిర్మాణానికి తమ వంతు కృషి కొనసాగించగలరని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారీఎత్తున పరివార్ సంస్థల కార్యకర్తలు,ప్రజలు ఫాల్గున్నారు.