
టీటీడీ ధర్మ ప్రచారంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీలు, గ్రామాలలో మరో 500 దేవాలయాలు నిర్మించాలని, ఒక్కొక్క ఆలయానికి గరిష్ఠంగా 10 లక్షలు మంజూరు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ సమావేశం సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, సమరసత సేవా ఫౌండేషన్ తో కలిసి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని గ్రామాలలో మరింత విస్తృతంగా సనాతన హైందవ ధర్మాన్ని ప్రచారం చేయడానికి టీటీడీ సన్ కల్పించినట్లు శ్రీ వై వి సుబ్బారెడ్డి తెలిపారు.
రాష్ట్రాలలోని 360 మండలాలలో ఒక్కొక్క మండలం నుంచి 15 గ్రామాలను ఎంపిక చేయాలన్నారు. ఆయా గ్రామాలలో మొత్తం 4000 ఇళ్లపై “ధర్మో రక్షతి రక్షితః” స్టిక్కర్లు అంటించడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలు అందించడం, కంకణాలు, ఇతర హిందూ ధార్మిక సాహిత్యాన్ని ఇంటింటికి అందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ నిర్వహించే బాలవికాస కేంద్రాలకు పుస్తక ప్రసాదంగా వివిధ ఆధ్యాత్మిక పుస్తకాలను అందించాలని ఆయన కోరారు. హిందూ ధార్మిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో 13 జిల్లాలలో నిర్వహించే హిందూ ఆత్మగౌరవ యాత్ర, 11వ తేదీ నిర్వహించే గీతా యజ్ఞానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశామని ఆయన తెలిపారు.
తిరుమల శ్రీవారి సోదరి అయిన తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా 25 లక్షలు ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్, బర్డ్ ట్రస్ట్ అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు బి కరుణాకర్ రెడ్డి, డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవింద హరి, శివ కుమార్, బి పి అనంత, తిరుపతి జేఈఓ బసంత కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.