News

ఉగ్ర లింకుల కేసులో వెలుగుచూసిన కీలక విషయాలు

64views

ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌ ఐడీల ద్వారా ఎర వేశారు. తదుపరి లెవల్‌కు వెళ్లేందుకు డబ్బులు చెల్లింపుతో నమ్మకం కల్పించారు. జీహాదీ భావజాలాన్ని నూరిపోశారు. ఆత్మాహుతికి కూడా తెగబడేలా ప్రేరేపించారు. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో నిందితుల విచారణ వేళ కీలక విషయాలు వెలుగు చూశాయి. నిందితుల కస్టడీ పూర్తి కావడంతో పోలీసులు వారిని రాజమహేంద్రవరం కారాగారానికి తరలించారు.

ఉగ్ర లింకుల కేసులో ఆరుగురు నిందితుల ఐదు రోజుల కస్టడీ సోమవారంతో ముగిసింది. వీరిని ఐదు రోజుల పాటు విచారించిన పోలీసులు పలు కోణాల్లో ప్రశ్నించారు. ఒకరికొకరు అంతకుముందు ఏమాత్రం పరిచయం లేదు కదా? సామాజిక మాధ్యమాల్లో ఎలా కలిశారని నిందితులను పోలీసులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నిందితులు ఫ్రీ ఫైర్‌ గేమ్‌ ఆడేవాళ్లని గుర్తించారు. ఆ ఐడీల ద్వారా విదేశీ హ్యాండ్లర్లు వీరికి గాలం వేశారని తెలిసింది. ఈ గేమ్‌లో తదుపరి లెవెల్‌కు వెళ్లేందుకు చందాను విదేశీ హ్యాండ్లర్లు చెల్లించేవారని సమాచారం.

ఇలా నెమ్మదిగా వారిని ఉచ్చులోకి లాగిన తర్వాత తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించారని తెలిసింది. భారత్‌లో ఇస్లామిక్‌ రాజ్యాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంగా పెట్టుకున్నారని ఫ్రీ ఫైర్‌ గేమ్‌ ద్వారా పరిచయమైన వీరంతా తరచూ ఇన్‌స్టాలో వేర్వేరు ఐడీలతో సంభాషించుకునేవారని సమాచారం. విదేశీ హ్యాండ్లర్‌ షుకూర్‌ వీరిని రెచ్చగొట్టేవాడని గుర్తించారు. దిల్లీకి చెందిన లక్కీ అహ్మద్‌ బెనెక్స్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి మిగిలిన వారందరినీ కలిపాడని వెల్లడైంది. లక్కీ అహ్మద్‌తో పాటు, విజయవాడకు చెందిన రహంతుల్లా సామాజిక మాధ్యమాల్లో ఉగ్ర భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో, పలువురిని ఇందులోకి ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారని తెలిసింది.

నిందితులు షాద్‌మాన్‌ దిల్‌ఖుష్, లక్కీ అహ్మద్, జిషాన్‌ అబ్దుల్‌ మజీద్, మిర్‌ ఆసిఫ్‌ అలీ, షారుక్‌ఖాన్, ఫయాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌కు వైద్యపరీక్షలు చేయించి, విజయవాడలోని సీఎంఎం కోర్టులో న్యాయాధికారి రాధారాణి ఎదుట హాజరుపరిచారు. కస్టడీలో నిందితులు వెల్లడించిన అంశాలతో కూడిన మధ్యవర్తుల నివేదికను కోర్టుకు సమర్పించారు. వీరిని రిమాండ్‌కు తరలించాలని న్యాయాధికారి ఆదేశించడంతో బందోబస్తు మధ్య రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉన్న మైనర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడగా అది సోమవారం జువెనైల్‌ కోర్టులో విచారణకు వచ్చింది. ప్రాసిక్యూషన్‌ తరఫున కౌంటరు దాఖలు చేసేందుకు ఈ నెల 15వ తేదీకి విచారణను న్యాయాధికారి వాయిదా వేశారు.

తదుపరి విచారణ జూన్ 13కి వాయిదా: ఉగ్రలింకుల కేసులో అరెస్టు అయిన మైనర్​ రిమాండ్​ను ఈనెల 24 వరకు పొడిగించారు. అతడి కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ పై తదుపరి విచారణ జూన్ 13కి వాయిదా పడింది. మైనర్​కు సంబంధించిన విచారణ కూడా ఉగ్రవాద కార్యకలాపాల చివరి విడత నిందితుల విచారణలో కీలకం కానుంది.

ఈ కేసులో విజయవాడలోని ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించడంతో పాటు జిహాద్ సిద్ధత కోసం యువతను ప్రేరేపించడంలో ప్రధాన పాత్ర ఎవరు పోషించారు, వారితో వీరికి ఉన్న సంబంధాలు, విదేశీ హ్యాండ్లర్ల ఎవరూ అన్న విషయాలు దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడ, దిల్లీ, జోధ్పూర్ వంటి ప్రాంతాల మధ్య టెర్రరిస్టు సంబంధాలు భద్రతా ముప్పులు సన్నిహితంగా పరిశీలనలో ఉన్నాయి.