
రాచరికమైనా, ప్రజాస్వామ్యమైనా పాలకులు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండాలి, కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ధర్మ పరిపాలన చేయాలి, ప్రజోపయోగ పనులు చేపట్టాలి. అప్పుడే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు. దేశమైనా, రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటాయి.
శ్రీరాముడు వనవాసానికి వెళ్లిన విషయం తెలుసుకున్న భరతుడు- అన్నను తిరిగి అయోధ్యకు తీసుకెళ్లి, పరిపాలన చేయమని ప్రార్థించేందుకు సపరివారంగా అరణ్యానికి వెళ్తాడు. అప్పుడు శ్రీరాముడు కుశల ప్రశ్నల రూపంలో భరతుడికి అనేక రాజనీతి విషయాలను బోధిస్తాడు. చేయాల్సినవీ చేయకూడనివీ ఏమిటో చెబుతాడు. విశ్వాసపాత్రులు, సమర్థులు, రాజనీతిశాస్త్రంలో ఆరితేరినవారు, ప్రలోభాలకు లొంగనివారు, పాలకుడి మనసు తెలిసిన వారిని మంత్రులుగా నియమించుకోవాలని సూచిస్తాడు. రాముడు ఇంకేం చెబుతాడంటే- రాజు సదా అప్రమత్తంగా ఉంటూ కర్తవ్యాల గురించే ఆలోచించాలి. పాలనకు సంబంధించిన నిర్ణయాలన్నీ తానొక్కడే తీసుకోకూడదు. కొంతమంది ముఖ్యులతో చర్చించాలి. పాలనకు సంబంధించిన అలాంటి కీలక సమాచారం ఏదీ బయటికి పొక్కకూడదు. తక్కువ సాధన సంపత్తితో ఎక్కువ ఫలితాలనిచ్చే పనులను ఆలస్యం చేయకుండా ఆరంభించాలి. చేసేందుకు నిశ్చయించిన పనుల గురించి పాలకుడుకానీ, మంత్రులుకానీ ప్రకటించక ముందే దాని గురించి ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడాలి. ఏ పని విషయంలోనైనా అనేకమంది మూర్ఖులతో చర్చించడంకన్నా అన్ని విషయాలు తెలిసిన ఒక్క నిపుణుడితో చర్చిస్తే మేలు.
వ్యక్తుల నైపుణ్యాలూ సామర్థ్యాలను బట్టి ఉన్నత, మధ్య, కింది స్థాయి ఉద్యోగాలకు ఎంపిక చేయాలి. త్రికరణ శుద్ధి గలవారు, ఉత్తములైన వ్యక్తులను ప్రధాన శాఖలకు మంత్రులుగా నియమించాలి. ప్రజలను బాధపెట్టేలా, అన్యాయంగా సుంకాలు విధించకూడదు. నేరం చేయనివారికి శిక్షలు విధించినా, నేరస్థుల్ని వదిలిపెట్టినా… ప్రజలు ఆ ప్రభువును తిరస్కరిస్తారు. శత్రువులను నిలువరింపగల సమర్థుడు, వ్యూహాలు రచించడంలో నేర్పరి, విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ఉండే వ్యక్తిని సేనాపతిగా నియమించాలి. ఉద్యోగులకు జీతభత్యాలను సంతృప్తికరంగానూ సకాలంలోనూ చెల్లించాలి. రాజ్య రక్షణ, సుపరిపాలన కోసం అధికారుల నుంచి మంత్రుల వరకూ ఎవరైనా ప్రాణాలు ఒడ్డేందుకైనా సిద్ధంగా ఉండాలి. ఇతరుల భావాలను గ్రహించగలవారు, కార్యదక్షులు, సమయస్ఫూర్తి, యుక్తాయుక్త విచక్షణ గలవారు, ప్రభువు సందేశాలను యథాతథంగా అవతలివారికి తెలుపగలవారిని విదేశాలలో దూతలుగా నియమించాలి. గూఢచారుల ద్వారా ఎప్పటికప్పుడు దేశ, కాల- పరిస్థితులను తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజల సుఖసంతోషాలే తమ పరమావధిగా పాలకులు భావించాలి. సమాజానికి అపకారం కలిగించేవారి నేరాలకు తగిన శిక్షలు విధించాలి. ఇలాంటి పాలనలోనే దేశం సుభిక్షంగా ఉంటుందని సోదరుడికి వివరిస్తాడు శ్రీరాముడు. నేటి పాలకులకూ ఇవి మంచి పాఠాలే కదా!





