News

విద్యార్ధిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఫ్రొఫెసర్ అబ్దుల్….

100views

విద్య నేర్పాల్సిన గురువే హద్దులు మీరి ప్రవర్తించిన ఘటన బెంగళూరు శివార్లలోని నెలమంగళ సమీపంలో వెలుగుచూసింది. తరగతి గదిలో విద్యార్థులందరి ముందూ ఒక వైద్య విద్యార్థినికి అనుచిత ప్రతిపాదన చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను సదరు యువతి నిలదీయడమే కాకుండా, చెప్పులతో కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. నెలమంగళ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ & రీసెర్చ్ సెంటర్ (T. బేగూరు)లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. మైక్రోబయాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ రెహమాన్ షరీఫ్ (48), మార్చి 23న తరగతి గదిలోకి ప్రవేశించి విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం, ఒక 19 ఏళ్ల విద్యార్థినిని ఉద్దేశించి అందరి ముందూ “ఐ లవ్ యూ” అంటూ ప్రపోజ్ చేశాడు.

ప్రొఫెసర్ చర్యతో షాక్‌కు గురైన విద్యార్థిని వెనక్కి తగ్గకుండా అతడిని గట్టిగా నిలదీసింది. “మీ వయస్సెంత? మీరు మాట్లాడుతున్నది ఏంటి?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తోటి విద్యార్థులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. ప్రొఫెసర్‌ను తరగతి గది నుంచి బయటకు లాగి, సదరు విద్యార్థిని తన చెప్పుతో అతడిని కొట్టింది. ఈ దృశ్యాలను కొందరు విద్యార్థులు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కళాశాల ప్రిన్సిపాల్ దివాకర్ ఎస్‌వి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెలమంగళ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 74 (మహిళా గౌరవానికి భంగం కలిగించడం), సెక్షన్ 75(1) (లైంగిక వేధింపులు), మరియు సెక్షన్ 329(3) కింద కేసులు నమోదయ్యాయి. నిందితుడికి పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించారు.

గతంలో కూడా ఈ ప్రొఫెసర్‌పై ఇలాంటి ఫిర్యాదులు రావడంతో, విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో అతడిని క్యాంపస్‌లోకి రావద్దని యాజమాన్యం ఆదేశించింది. అయితే, నిబంధనలు ఉల్లంఘించి మార్చి 23న క్లాస్‌రూమ్‌లోకి ప్రవేశించి ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. తక్షణమే స్పందించిన యాజమాన్యం అబ్దుల్ రెహమాన్ షరీఫ్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించింది.