
Ramayana Retold with Scientific Evidences (శాస్త్రీయ ఆధారాలతో మరొకసారి రామాయణం) పుస్తకాన్ని సరోజ్ బాలా రచించారు. వాల్మీకంలోని ఖగోళ, పురావస్తు, భౌగోళిక ఆధారాలను ఉపయోగించుకుని శ్రీరాముని జీవితంలోని ఘట్టాలను ఆమె వాస్తవాలుగా నిరూపిం చారు. నాసా (NASA) తీసిన ‘రామసేతు’ ఉపగ్రహ చిత్రాలను, ప్లానెటోరియం సాఫ్ట్ వేర్ ద్వారా గ్రహించిన ఖగోళ శాస్త్ర ఆధారా లను ఆ చారిత్రక సత్యాల నిరూపణకు వినియోగించారు. ఆ వివరాలను అధ్యయనం చేయడం గొప్ప అనుభవం.
రామాయణం చరిత్రేననడానికి అనేక భౌగోళిక, పురావస్తు, శాస్త్రీయ ఆధారా లున్నాయి. రామసేతు (ఆడమ్స్ బ్రిడ్జి), అయోధ్య, జనకపూర్, చిత్రకూట్, దండకారణ్యం, హంపి (కిష్కింధ) రామేశ్వరం, లేపాక్షి వంటి ప్రదేశాలు నేటికీ ఉన్నాయి. శాటిలైట్ చిత్రాలు అందించిన రామాయణ కాలపు వృక్షశాస్త్ర/ ఖగోళశాస్త్ర ఆధారాలు ఉన్నాయి. ఇవి నాటి పురాతన చారిత్రక వాస్తవాన్ని సమర్థిస్తున్నాయి.
రామసేతు తమిళనాడులో భాగమైన రామేశ్వర (పంబన్) ద్వీపానికీ, శ్రీలంకకు చెందిన మన్నర్ ద్వీపానికీ మధ్య ఉన్న ఇసుకదిబ్బల శ్రేణి. వీటిలో ఇసుక సున్నపురాయి ఎక్కువ. హిందూ మహా సముద్రంలోని ఈ ఇసుక దిబ్బల పొడవు 18 మైళ్లు (30 కిలో మీటర్లు). 1788లో ఆస్ట్రేలియాకు చెందిన బొటానికల్ ఎక్స్‌ప్లోరర్ జోసెఫ్ పార్క్ అన్వేషణల ఆధారంగా, ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మొదటి సర్వేయర్ జనరల్ జేమ్స్ రెనలే ఒక మ్యాప్‌ను గీశాడు. దీనిని మేప్ ఆఫ్ హిందూస్థానీ అని లేదా మేప్ ఆఫ్ మొగల్ ఎంపైర్ అనేవారు. నాసా ఉపగ్రహ చిత్రాలు దీనిని ధృవీకరించాయి.
వాల్మీకి రచన ప్రకారం శ్రీరాముడు వానరసైన్యం సాయంతో ఈ సేతువును నిర్మించాడు. పలురకాల చెట్లకాండాలతో, నీళ్లలో తెలియాడే ఇటుకలతో ఈ వారథిని నిర్మించి (నేటికి అవి రామేశ్వరంలో కనిపిస్తాయి), వానర సైన్యాన్ని లంకకు తీసుకువెళ్లి, రాక్షసులను ఓడించి సీతామాతను తీసుకువచ్చాడు. పర్షియా (నేటి ఇరాన్)ను జయించడానికి క్రీ।।పూ।। 332లో అలెగ్జాండర్ టైర్ (ద్వీపం) నగరానికి (ప్రస్తుతం లెబనాన్ తీరంలో ఉంది) ఒక వంతెన లేదా కాజ్‌వేను నిర్మించాడు. టైర్ నగరం సముద్ర తీరం నుండి సుమారు కిలోమీటర్ దూరంలో ఉండి జయించడానికి కష్టంగా ఉండేది. అలగ్జాండర్ ఇంజనీర్లు సముద్రంలో సుమారు 800 మీటర్ల నుండి ఒక కిలోమీటర్ పొడవైన వంతెనను నిర్మించారు. ఇప్పుడు అది ద్వీపకల్పంగా మారిందని పరిశో ధనలలో తెలిసింది. దీని నిర్మాణానికి వారు రామసేతును నమూనాగా తీసుకున్నారన్న అభిప్రాయం ఉంది.
శ్రీరాముడు అయోధ్య దక్షిణ భాగమైన ‘రామకోటి’లో జన్మించాడు. అయోధ్య కోశల రాజధాని. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఇక్కడే నేడు బాలరామునికి దేవాలయం నిర్మించారు.నేపాల్ రాజధాని కట్మాండుకు ఆగ్నేయంలోని జనక్‌పూర్‌లో జానకీ మందిరం ఉంది. సీతమ్మతల్లి జన్మించింది ఇక్కడే. సీతారామ కల్యాణం జరిగిందీ ఇక్కడే. నేటికి జనక్‌పూర్‌లో కల్యాణానికి చుట్టుప్రక్కల గ్రామాల వారు పసుపుకుంకుమలు తీసుకువస్తారు. శ్రీరామ చంద్రునికి జనక్‌పూర్‌లో కొంతభూమి ఇచ్చారట. ఏటా నవమినాటికి కొంత ధాన్యంతో నేపాలీలు అయోధ్య వచ్చేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఆ భూమిపై వచ్చిన ఆదాయాన్ని (స్త్రీ ధనం) గుర్తుగా ఏటా తీసుకువచ్చి నవమినాడు జానకమ్మకు ఇచ్చేవారట. నెహ్రూ ప్రధాని అయ్యాక దానిని తిరస్క రించినట్లు చెపుతారు. తద్వారా ఆ సంప్రదాయం పోయింది.
బిహార్‌లోని దర్భంగా జిల్లాలో అహల్యాస్థాన్ ఉంది. యాగరక్షణకు బయల్దేరిన శ్రీరాముడు మార్గ మధ్యలో గౌతముడి భార్య అహల్యను కటాక్షిస్తాడు. ఈ ప్రదేశమే అహల్యస్థాన్. ఈ ఆలయానికి సమీపంలో భోజ్‌పూర్ ఉంది. ఇక్కడే శ్రీరాముడు తాటకిని సంహారిస్తాడు.
శ్రీరాముడు చిత్రకూట్‌లో 14 ఏళ్లు అరణ్యవాసం చేశాడు. భరతుడు వచ్చి అన్నను కలిసింది ఇక్కడే. చిత్రకూట్‌లో సీతారాముల పాదముద్రలున్నాయి. ఈ ఆలయం ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్య ఉంది.
రావణ వధ తరువాత శివుడిని పూజించడానికి రాముడు ప్రతిష్టించిన లింగం రామేశ్వరంలో ఉంది. రుష్యమూక పర్వతం, హనుమంతుడు రాముని కలిసిన ప్రదేశం, కర్ణాటక హంపి ప్రాంతంలో ఉన్నాయి. జటాయువు రావణునితో పోరాడి సీతను రక్షించే ప్రయత్నంలో కూలిన చోటు-లేపాక్షి. ‘లేపక్షీ’ అని రాముడు అన్నట్లుగా ప్రతీతి. అది ఆంధప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఉంది, అదే ‘లేపాక్షి’.
మిస్టీరియస్ కోబ్రాహుడ్ గుహ శ్రీలంకలో సిగిరియాలో ఉంది. ఈ గుహగోడలపై పురావస్తు శాస్త్రవేత్తలు కొన్ని చిత్రాలను గుర్తించారు. అవి సీతమ్మ తల్లిని అసురులు బంధించిన దృశ్యాలుగా చెబుతారు. శ్రీలంకలో ‘సీతా కోటువ’ అనే ప్రదేశం ఉంది. రావణుడు సీతమ్మతల్లిని అపహరించాక ఇక్కడనే బంధించాడని చెపుతారు. శ్రీలంకలో నిజమైన అశోకవనం ఉంది. ఈ వనానికి సమీపంలో హనుమాన్ పాదముద్రలు కనిపిస్తాయి.
రాక్షసులకు వానరులకు మధ్య విజయదశమి రోజున ప్రారంభమైన యుద్ధం 21 రోజులు జరిగింది. 21వ రోజున శ్రీరాముడు రాక్షసులను ఓడించి సీతాదేవిని తీసుకుని అయోధ్యకు వచ్చాడు. ఆ రోజునే దీపావళి చేసుకున్నారు (దసరా నుండి దీపావళికి 21వ రోజులు). దీపావళి రోజున రామ లీలా మైదానంలో రావణ సంహారం కార్యక్రమాన్ని నిర్వహించడం అందుకే.
“The scientific evidence given in the book relating to dates of important events in the life of Sri Rama, along with the sky views and pictures of other artifacts, are so realistic that the reader gets transported to the Ramayana era and feels as if one is actually watching the events happening”
(Sonal Mansingh Padmavibhushan, Member of Rajya Sabha)
సరోజ్ బాలా పరిశోధన శ్రీరాముని జననంతో ప్రారంభమైంది. వాల్మీకి రామాయణం ప్రకారం చైత్ర శుక్ల నవమి 5114 బి.సి.ఇ. ఈ రోజుకు ఖగోళ శాస్త్రలెక్కల ప్రకారం సరిగ్గా సరిపోయింది.”Sequential astronomical dates exactly matched the discriptions in Ramayana then I looked for other supporting evidences” (P-23). రామాయణ కాలంలో వాడిన ఆయుధాలు, వంటపాత్రలు, నగలు, విలువైన రాళ్లు, ఫలాలు, కూరగాయలు ధాన్యం, కందమూలాలలను శోధించినట్టు ఆమె చెప్పారు. ఆమె సింధు, గంగ, సరస్వతి నదీ పరివాహక ప్రాంతాలలో జరిపిన త్రవ్వకాలలో ఈ వస్తువులు దొరికాయి. ముఖ్యంగా రాగి బాణాలు (అంబులు), ఉంగరాలు, చూడామణి (తల గొలుసు) మట్టిపాత్రలు, బియ్యం బార్లీ, దానిమ్మలు, మొదలైనవి. కార్బన్ 14 టెస్టింగ్ ప్రకారం ఈ వస్తువుల కాలం బి.సి.ఇ.7000 -4000. ఇది ఖగోళ శాస్త్ర పరిశోధనలకు దగ్గరగా ఉన్నది. దీనిని నిర్వహించినవారు ఉత్తర ప్రదేశ్ పురావస్తు శాఖ. భారత పురావస్తు సర్వే (ఎ.ఎస్.ఐ) ఇచ్చిన నివేదికలో ఇవి ఉన్నాయి. వాల్మీకి గొప్ప భూగోళశాస్త్రవేత్త. తన గ్రంథంలో నేటి ఉత్తరంలో అఫ్ఘానిస్తాన్, దక్షిణంలో రామేశ్వరం, పడమరన మహారాష్ట్ర (నాసిక్), తూర్పున కోటుమ్‌సర్ (ఛత్తీస్‌ఘఢ్) సరిహద్దుగా గుర్తించాడు (కోటుమ్‌సర్ బస్తర్ జిల్లాలోనిది). ఇవి రామరాజ్యానికి సరిహద్దులు.





