ArticlesNews

సీతాదేవి జీవన సందేశం పంచపరివర్తన్

140views

భారతీయ సమాజంలో నైతిక, సాంస్కృతిక, సామాజిక పునరుజ్జీవనం కోసం రూపొందించబడిన ఒక గొప్ప కార్యాచరణే పంచపరివర్తన్. ఈ మార్పులకు మూలస్తంభంగా మహిళా శక్తిని, ముఖ్యంగా సీతాదేవి వంటి ఆదర్శ మూర్తుల స్ఫూర్తిని మనం తీసుకోవచ్చు.

సమాజానికి పునాది కుటుంబం. సీతాదేవి కష్టకాలంలో కూడా ధర్మాన్ని, కుటుంబ విలువలను ఎలా కాపాడిందో, నేటి మహిళలు కూడా తమ కుటుంబాల్లో అలాంటి సంస్కారాన్ని పెంపొందించాలి. టీవీ, మొబైల్ సంస్కృతికి దూరంగా, వారానికి ఒకసారి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తూ,.. దేశభక్తి , నైతిక విలువలున్న కథలను చర్చించుకోవడమే కుటుంబ ప్రభోధన్.

కుల, మత, ప్రాంతీయ భేదాలను విస్మరించి భారతీయ సమాజమంతా ఒక్కటే అనే భావనను పెంపొందించడమే సామాజిక సమరసత. సీతాదేవి వనవాస సమయంలో సీతాదేవి అరణ్యంలో ఉన్న గిరిజనులను, వానరులను తన సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లలా ఆదరించింది. తాను రాచరికపు మహిళ అయినప్పటికీ ఆమె ఎప్పుడూ ఆ బేధభావాన్ని వారిపైన చూపలేదు. అలా సీతమ్మ తల్లి అట్టడుగు వర్గాల వారితో ఆత్మీయంగా మెలిగినట్లే, నేటి సమాజంలో అంటరానితనం వంటి వివక్షలను తొలగించి, అందరినీ సమానంగా గౌరవించే సంప్రదాయం మనకు రావాలి.

సీతాదేవిని మనం “భూమిజ” అని పిలుచుకుంటాం. ఆమె జననం భూమి నుండి జరిగింది, వనవాస కాలంలో కూడా సీతారాములు ప్రకృతి ఒడిలోనే గడిపారు, చివరకు భూమాతలోనే సీతమ్మ ఐక్యం అయింది. అందుకే ప్రకృతిని మనం రక్షిస్తే, ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. సీతాదేవి పుట్టిన ఈ భూమిని మనం కాలుష్య రహితంగా ఉంచడమే ఆమెకు మనం ఇచ్చే నిజమైన గౌరవం.
పంచపరివర్తన్‌లోని “స్వదేశీ” అంశం కేవలం వస్తువుల వాడకానికి మాత్రమే పరిమితం కాదు, అది మన ఆత్మగౌరవానికి, దేశ ఆర్థిక స్వాలంబనకు సంబంధించినది. సీతాదేవి పరాయి రాజ్యమైన లంకలో ఉన్నప్పటికీ, అక్కడి భోగభాగ్యాలను తృణీకరించి తన ధర్మాన్ని, స్వదేశీ మూలాలను ఎలా కాపాడుకుందో, మనం కూడా అలాగే ఉండాలని చెబుతోంది.

పంచపరివర్తన్ సిద్ధాంతంలో పౌరబాధ్యత అనేది అత్యంత కీలకమైన అంశం. హక్కుల గురించి పోరాడటం కంటే, ఒక పౌరుడిగా సమాజం పట్ల మనకున్న బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే నిజమైన దేశభక్తి అని ఇది వివరిస్తుంది.

సీతాదేవి తన జీవితాంతం తన కర్తవ్యానికి , ధర్మానికి కట్టుబడి ఉన్నట్లే, ప్రతి పౌరుడు ధర్మానికి కట్టుబడి ఉండి, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సామాజిక స్పృహ కలిగి ఉండాలి.