ArticlesNews

చెత్త సేకరిస్తూనే విద్యావంతులుగా మారిన స్వచ్ఛతా దీదీలు

119views

చెత్తే కదా అని తీసి పారేస్తుంటాం. ఆ చెత్తే ఎంతోమంది మహిళల జీవితాలను నిలబెట్టింది. వందలాది మంది మగువలకు స్వయం సమృద్ధిని సాధించేందుకు ఊతాన్ని అందించింది. దీంతో చెత్త సేకరణ పనిని చేసే చాలామంది మగువలు ఉన్నత విద్యావంతులుగా మారారు. దీంతో వారికి సూపర్‌వైజర్లుగా, క్యాష్ కలెక్టర్లుగా, ఇన్‌‌ఛార్జ్‌లుగా ప్రమోషన్లు లభించాయి. ఇప్పుడు ఆ నారీమణులంతా తమ పిల్లలనూ చదువుల్లో మున్ముందుకు తీసుకెళ్లారు. కుటుంబాలకూ ఆసరాగా నిలుస్తున్నారు. ఈ విప్లవాత్మక మార్పులు ఎక్కడ వచ్చాయి? ఎలా వచ్చాయి? అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవపు (మార్చి 8) ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

480 మంది స్వచ్ఛతా దీదీలు
స్వచ్ఛభారత్ మిషన్ గురించి మనందరికీ తెలుసు. ఇంటింటి నుంచి చెత్తను సేకరించే కార్యక్రమాన్ని ఈ మిషన్‌లో భాగంగానే నిర్వహిస్తున్నారు. ప్రత్యేక వాహనాల్లో చెత్తను సేకరించాక తడి,పొడి చెత్తలను వేరుచేసే ప్రక్రియను చేస్తారు. ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా కేంద్రం పేరు అంబికాపుర్. అదొక మున్సిపల్ కార్పొరేషన్. అక్కడ 2014 నుంచే స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు అంబికాపుర్‌లో సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (ఎస్‌ఎల్‌ఆర్ఎం – SLRM) సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

చెత్త సేకరిస్తూనే విద్యావంతులుగా మారిన మహిళలు (ETV Bharat)

ఇందులో దాదాపు 480 మంది మహిళలు స్వచ్ఛతా దీదీలుగా సేవలు అందిస్తున్నారు. వీరిలో చాలామంది వితంతువులు, ఒంటరి మహిళలే. వీరు అంబికాపుర్‌లో తమకు కేటాయించిన ఏరియాల్లోని ఇళ్ల నుంచి చెత్తను సేకరిస్తారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరుచేసి, విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పొందుతారు. ఈ మహిళలకు ప్రతినెలా రూ.8వేల గౌరవ వేతనం, రూ.3వేల బోనస్ ఇస్తారు.

WOMEN EMPOWERMENT SURGUJA

చెత్త సేకరిస్తూనే విద్యావంతులుగా మారిన మహిళలు 

జీవితాలు ఇలా మారాయి!
2014లో అంబికాపుర్ పరిధిలోని కేనా డ్యామ్ ఎస్‌ఎల్‌ఆర్ఎం సెంటర్‌‌‌‌లో స్వచ్ఛతా దీదీలుగా చేరే నాటికి, చాలామంది మహిళల విద్యార్హతలు అంతంతే. అయితే దూర విద్య ద్వారా ఉన్నత విద్యను కొనసాగించాలని వారిని ఎస్‌ఎల్‌ఆర్ఎం సెంటర్‌‌ అధికారులు ప్రోత్సహించారు. దూర విద్యా కోర్సుల్లో అడ్మీషన్లు కూడా ఇప్పించారు.

దీంతో చెత్తను సేకరించే పనిని చేసే మహిళల్లో చాలామంది డిగ్రీ దాకా చదివారు. దీంతో వారికి కొన్నేళ్లలోనే అదే ఎస్‌ఎల్‌ఆర్ఎం సెంటర్‌‌లో సూపర్‌వైజర్లుగా, క్యాష్ కలెక్టర్లుగా, ఇన్‌ఛార్జ్‌లుగా ఉద్యోగాలు వచ్చాయి. చాలా మంది మహిళలు గత పది, 11 ఏళ్లుగా ఎస్‌ఎల్‌ఆర్ఎం సెంటర్‌‌లో పనిచేస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. తమ పిల్లలకూ ఉన్నత విద్యను అందిస్తున్నారు.

అప్పుడు స్వచ్ఛతా దీదీ- ఇప్పుడు ఇన్‌ఛార్జ్
“నా పేరు రేష్మా సోని. మాది అంబికాపుర్‌. నేను ఇంటర్ వరకు చదివాను. పెళ్లయిన కొన్ని రోజులకే నా భర్త చనిపోయారు. అనంతరం ఒక స్నేహితురాలి సహకారంతో కేనా డ్యామ్ ఎస్‌ఎల్‌ఆర్ఎం సెంటర్‌‌‌‌లో స్వచ్ఛతా దీదీగా చేరాను. ఇది 13 ఏళ్ల కిందటి మాట. అప్పుడు నేను చెత్త సేకరించే పనిని చేసేదాన్ని. ఇప్పుడు నేను అదే ఎస్‌ఎల్‌ఆర్ఎం సెంటర్‌‌‌‌లో ఇన్‌‌ఛార్జ్ హోదాలో ఉన్నాను. ఎస్‌ఎల్‌ఆర్ఎం సెంటర్‌‌‌‌ అధికారులు నాలాంటి స్వచ్ఛతా దీదీలను ప్రోత్సహించారు. దూర విద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించమని సూచించారు. నేను అలాగే చేశాను. డిగ్రీ పూర్తయింది. ఆ తర్వాత నాకు సెంటర్‌‌‌‌ ఇన్‌‌ఛార్జ్‌గా ప్రమోషన్ లభించింది. నా కుమారుడు ఇప్పుడు ఐదో తరగతిలో ఉన్నాడు. నా కొడుకుకు మంచి విద్యను అందించాలి. ఇదే నా జీవిత లక్ష్యం” అని రేష్మా సోని వివరించారు.

కనీసం నా కూతురికైనా ఉన్నత విద్యను అందిస్తా!
“నా పేరు శిరోమణి కెర్కెట్టా. ఇంటర్ వరకు చదివాను. నేనొక స్వచ్ఛతా దీదీని. ఎస్‌ఎల్‌ఆర్ఎం సెంటర్‌‌‌‌లో పనిచేస్తున్నాను. నా భర్త 2009లో చనిపోయారు. అనంతరం మా ఊరి నుంచి అంబికాపుర్‌కు షిఫ్ట్ అయ్యాను. 2009 నుంచి 2015 వరకు ఒక బాలుర హాస్టల్‌లో పనిచేశాను. 2015 నుంచి ఇప్పటిదాకా కేనా డ్యామ్ ఎస్‌ఎల్‌ఆర్ఎం సెంటర్‌‌‌‌లోనే వర్క్ చేస్తున్నాను. నాకు 18 సంవత్సరాల కూతురు ఉంది. ఆమె ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతోంది. నాకు బాగా చదువుకోవాలని ఉండేది. కానీ అది సాధ్యం కాలేదు. అందుకే నా కూతురిని బాగా చదివిస్తా. తద్వారా తన కాళ్లపై తాను నిలబడగలదు. నా కూతురి కాలేజీ ఫీజును కట్టాల్సి ఉన్నప్పుడు, ఒక నెల ఇంటి అద్దెను ఆపుతాను. ఆ డబ్బులతో ఫీజును చెల్లిస్తాను. ఈ విధంగా నా కూతురి చదువు ఖర్చులను మేనేజ్ చేస్తాను. ఆహార ఖర్చులు కూడా ఆచితూచి చేస్తాను” అని స్వచ్ఛతా దీదీ శిరోమణి కెర్కెట్టా చెప్పారు.

అంచెలంచెలుగా ఇన్‌ఛార్జ్ స్థాయికి
కేనా డ్యామ్ ఎస్‌ఎల్‌ఆర్ఎం సెంటర్‌‌‌‌లో సూపర్‌వైజర్‌గా సునీతా సర్కెల్ పనిచేస్తున్నారు. పలు సమస్యల కారణంగా ఆమె తన భర్త నుంచి విడిపోయారు. సునితకు 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె కూడా 2015లోనే ఎస్‌ఎల్‌ఆర్ఎం సెంటర్‌‌‌‌లో స్వచ్ఛతా దీదీగా జాయిన్ అయ్యారు. అంచెలంచెలుగా సూపర్‌వైజర్‌ స్థాయికి చేరారు. ఎస్‌ఎల్‌ఆర్ఎం సెంటర్‌‌‌‌ అధికారులు అందించే ప్రోత్సాహం వల్లే తాము ఉన్నత విద్యా కోర్సులు చేయగలుగుతున్నామని, ప్రమోషన్లు పొందగలుగుతున్నామని సునిత చెప్పారు.

ఈ సెంటర్‌లో డబ్బు, గౌరవం రెండూ లభిస్తాయి!
“కేనా డ్యామ్ ఎస్‌ఎల్‌ఆర్ఎం సెంటర్‌‌‌‌లో మహిళలు పూర్తి సురక్షితమైన వాతావరణంలో పని చేస్తారు. ఇక్కడ పనిచేయడం వల్ల డబ్బుతో పాటు గౌరవం కూడా లభిస్తుంది. మహిళలపై ఎటువంటి పని ఒత్తిడి ఉండదు. ఎందుకంటే ఈ సెంటర్‌లో ఇన్‌ఛార్జ్‌లు కూడా మహిళలే. ఎవరైనా ఏదైనా చెప్పినా, వారు బాధపడరు. స్వచ్ఛతా దీదీలు సహా అన్ని హోదాల సిబ్బంది రోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డ్యూటీలో ఉంటారు” అని సూపర్‌వైజర్ సునీతా సర్కెల్ తెలిపారు.

జీవితాన్ని ప్రసాదించిన ఎస్‌ఎల్‌ఆర్ఎం సెంటర్‌‌‌‌
సరిత కుజుర్ కూడా కేనా డ్యామ్ ఎస్‌ఎల్‌ఆర్ఎం సెంటర్‌‌‌‌లో చెత్త సేకరించే పనిని చేస్తున్నారు. ఆమె గత పదేళ్లుగా ఈ సెంటర్‌లో వర్క్ చేస్తున్నారు. ఆమె భర్త ప్రమాదంలో మరణించారు. ఈ సెంటర్ నుంచి లభించే వేతనంతోనే తన ఇద్దరు పిల్లలను సరిత పెంచుతున్నారు. ఆమె తన ఇద్దరు పిల్లలను హాస్టల్‌లో చేర్పించారు. సరిత ఎస్‌ఎల్‌ఆర్ఎం సెంటర్‌‌‌‌లోనే నివసిస్తున్నారు. తన జీవితం మారడానికి కారణం ఈ సెంటరే అని ఆమె తెలిపారు.