
( మార్చి 11 – వెంకయ్యస్వామి జయంతి )
గొలగమూడి గ్రామంలో వెలసిన మహానుభావుడు శ్రీ వెంకయ్య స్వామి. ఆయన జీవితం భక్తి, దయ, త్యాగం మరియు ధర్మానికి ప్రతిరూపం. “ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలి” అనే ఉపదేశంతో ఆయన జీవితం సాగింది. అందుకే ప్రజలు ఆయనను భూమిపై ఉన్న దేవుడిగా భావించారు. శ్రీ వెంకయ్య స్వామి నెల్లూరు జిల్లాలోని నాగులవెల్లటూరు గ్రామంలో సోంపల్లి పిచ్చమ్మ మరియు పెంచలయ్య దంపతులకు 1887 మార్చ్ 11న జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయన సాధారణ బాలుడిలా కనిపించినా, ఆయనలో ఆధ్యాత్మిక లక్షణాలు స్పష్టంగా కనిపించేవి. ఆటలకంటే ఒంటరిగా ఉండి ధ్యానం చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపేవారు. స్నేహితులు ఆటకు పిలిచినా, “నేను తప్పు చేశాను, పోలీసులు వస్తారు” అని చెప్పి వారిని పంపించి ఒంటరిగా ధ్యానం చేసేవారు.
చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు స్వీకరించారు. 16 ఏళ్ల వయసులోనే అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి అమ్మి కుటుంబాన్ని పోషించారు. వ్యవసాయ పనుల్లో కూడా ఎంతో నైపుణ్యంతో పనిచేసేవారు. పొలంలో దున్నిన గీతలు ruler తో గీసినట్టు సూటిగా ఉండేవని గ్రామస్తులు ఆశ్చర్యపోయేవారు. ఆయన ప్రతి పనిని ఎంతో క్రమశిక్షణతో, శ్రద్ధతో చేసేవారు. ఆయనకు పని కూడా యోగమే.
సోదరి వివాహం తరువాత ఆయన పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారు. ఒకసారి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆయన విచిత్రంగా మాట్లాడటం ప్రారంభించారు. “మంగళ యోగం, చాకలి యోగం, జక్కల యోగం” అని వీధుల్లో తిరుగుతూ చెప్పేవారు. ఆ సమయంలో ప్రజలు ఆయనను పిచ్చివాడని అనుకున్నారు. కానీ అది ఆయన చేస్తున్న యోగసాధనలో భాగమని తరువాత భక్తులు గ్రహించారు.
అడవుల్లో ఒంటరిగా తిరుగుతూ కఠినమైన యోగ సాధనలు చేశారు. బావి దగ్గర చెట్టు కొమ్మలకు కాళ్లు కట్టి తలక్రిందులుగా వేలాడుతూ ధ్యానం చేసేవారు. ఆయనకు అప్పటినుంచే అద్భుత శక్తులు కనిపించాయి. భక్తుల బాధలను తెలుసుకొని వారిని రక్షించేవారు. మాటతోనే అనారోగ్యాలను నయం చేయడం, చిన్న వస్తువులను ఆశీర్వదించి ఇచ్చి కష్టాలను తొలగించడం వంటి అనేక చరిత్రలు ఉన్నాయి.
శ్రీ వెంకయ్య స్వామి జీవితంలో ధూనికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఎక్కడ ఉన్నా ఆ అగ్ని ఎప్పుడూ వెలుగుతూనే ఉండేది. భక్తుల పాపాలను ఆ అగ్నిలో దహనం చేస్తానని ఆయన చెప్పేవారు. ఆయన చాలా సరళమైన జీవితం గడిపారు. చిరిగిన బట్టలతోనే జీవిస్తూ భిక్ష తీసుకొని జీవనం సాగించారు. వెంకయ్యస్వామి ఎల్లప్పుడూ తంబూరా మీటుతూ ‘ఓం నారాయణ, ఆది నారాయణ’ అంటూ మధురముగా పాడుతుండేవారు. ఆయన బోధనలు చాలా సులువైన భాషల్లో ఉన్నా లోతైన తత్త్వాన్ని వివరిస్తాయి. ‘ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా’, ‘సన్యాసులుగా ధర్మం ఉండటంలో గొప్పేముందయ్యా, సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప’, ‘అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు..నీవు దేవుడిని చూడగలవు కదయ్యా’, ‘పావలా దొంగలిస్తే, పది రూకల నష్టం వస్తుంది గదయ్యా’… ఈ విధంగా ఉండేవి ఆయన బోధనలు.
1982 ఆగస్టు 24న ఆయన మహాసమాధి పొందారు. కానీ ఆయన భక్తులకు ఇచ్చిన మాట ఏమిటంటే — “సూర్య చంద్రులు ఉన్నంత వరకు నేను ఇక్కడే ఉంటాను”. అందుకే ఇప్పటికీ గొలగమూడి సమాధి మందిరంలో భక్తులు ఆయనను దర్శించి కష్టాల నుంచి విముక్తి పొందుతున్నారు. ఈ విధంగా శ్రీ వెంకయ్య స్వామి జీవితం మనకు దయ, నిజాయితీ, సేవాభావం మరియు ఆధ్యాత్మిక మార్గాన్ని నేర్పే గొప్ప సందేశంగా నిలిచింది.





