
ఈ ఏడాది మహిళా దినోత్సవ నినాదం ‘గివ్ టు గెయిన్’… దీన్ని ఏనాడో పాటించి చూపించారు గాంధేయవాది ఇలా భట్. అసంఘటిత, స్వయం ఉపాధి రంగాల్లోని మహిళలకు చేయూతనిచ్చి వారి ఉద్యోగాలకు భద్రత కల్పించారు. వారి హక్కులను సంరక్షించారు.
అహ్మదాబాద్‌లో జన్మించారు ఇలా భట్. లాయర్‌గా, సామాజిక కార్యకర్తగా, గాంధేయవాదిగా… నిరంతరం ఆమె పోరాటం మహిళల హక్కులకోసమే. అయితే, ఇది పూర్తిగా అహింసా మార్గంలోనే సాగింది. 1970లలో ఇలా భట్ అహ్మదాబాద్‌లోని టెక్స్‌టైల్ లేబర్ అసోసియేషన్‌లో పనిచేశారు. ఆ సమయంలో టెక్స్‌టైల్ మిల్లులతో పాటు బీడీ రోలర్లు, ఇంటిపనివారు, వీధివ్యాపారులు, రైతు కూలీలుగా అసంఘటిత రంగాల్లో పనిచేసే మహిళలకు కనీస వేతనాలు, హక్కులు వంటివి లేవనే విషయాన్ని ఆమె గుర్తించారు. ముఖ్యంగా వీళ్లకు యూనియన్లు లేవు. బ్యాంకులోన్లు రావు. సామాజిక భద్రత అసలే లేదు. దీంతో పనిచేసే ఆడవాళ్లు అన్యాయంగా దోపీడీకి గురవుతున్నారని తెలుసుకున్నారు. దాంతో సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్స్ అసోసియేషన్(సేవ)అనే ట్రేడ్ యూనియన్‌ని స్థాపించారు.
‘సేవ’ ఏం చేస్తుంది?
‘సేవ’ సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద మహిళా ట్రేడ్ యూనియన్. ప్రస్తుతం ఇందులో సుమారు 29 లక్షలమంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 18కి పైగా రాష్ట్రాల్లో దీని కార్యకలాపాలు విస్తరించాయి. ఇది ట్రేడ్ యూనియన్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లా పనిచేస్తుంది. చేసిన పనికి న్యాయంగా రావాల్సిన జీతాలు, పని చేసేందుకు అనువైన పరిస్థితుల కల్పన… వంటి వాటి కోసం పోరాడుతుంది. ఆపై అంటే… 1974లో ఈ సంస్థ కింద సేవా కో-ఆపరేటివ్ బ్యాంకు ఏర్పాటైంది. దీని ద్వారా సూక్ష్మరుణాలు, పొదుపు, బీమా, పెన్షన్ వంటివి మహిళలకు అందుబాటులోకి వచ్చాయి. నైపుణ్యాల శిక్షణ, టెక్నాలజీ-మార్కెట్ లింకేజీతో పాటు… సభ్యులందరికీ ఆరోగ్య బీమా, చైల్డ్ కేర్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ కృషికే ఇలాను పద్మశ్రీ, పద్మభూషణ్, రామన్ మెగససే వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులెన్నో వరించాయి. ప్రపంచస్థాయి గుర్తింపు దక్కింది.
ఏ రంగంలోనైనా మహిళల భాగస్వామ్యం ఉంటేనే స్వావలంబన సాధ్యం అని చెప్పిన ఇలా భట్ 89 ఏళ్ల వయసులో మరణించారు. ఆమె లేకపోతేనేం… ఇలా అందించిన స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగుతున్నారు.





