ArticlesNews

స్త్రీ సాధికారతకు చక్కని ఉదాహరణ బామ్మల బడి

101views

చదువుకోవడానికి స్కూలుకెళ్లే పిల్లల్ని చాలామందినే చూసుంటాం. కానీ, పుస్తకాల బ్యాగులు తగిలించుకుని గులాబీ రంగు చీరలు కట్టుకుని మరీ బడికెళ్లే ఈ బామ్మల గురించి తెలుసా? లేదంటే ఇది చదివేయండి.

ఆజీబాయీచీశాల… మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరులో ఉన్న బామ్మల బడి ఇది. 2016లో మహిళా దినోత్సవం రోజున నిరక్షరాస్యులైన వృద్ధ మహిళలకోసం దీన్ని ఏర్పాటుచేశారు. కరవు, వ్యవసాయ సంక్షోభం… వంటి సమస్యలతో సతమతమవుతోన్న చోట మహిళలకు అక్షరాస్యత అవసరమని భావించారు స్థానిక టీచర్‌ యోగేంద్ర బంగర్‌. ఈయన ఆలోచనకు మోతీరామ్‌ దలాల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారం అందించడంతో ఈ బడి ఏర్పాటైంది. రోజూ మధ్యాహ్నం 2-4 గంటల వరకూ ఇక్కడ తరగతులు నిర్వహిస్తారు. దీంతో ఒత్తిడి లేకుండా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుని ఎంచక్కా బడికి వచ్చేస్తారీ విద్యార్థినులు. సమానత్వ భావన, శక్తికి సూచనగా రూపొందించిన గులాబీ రంగు చీరల్ని యూనిఫామ్‌గా ధరించి మరీ హాజరవుతారు.

నడవలేని నానమ్మ, చూపు తగ్గిన అమ్మమ్మ… ఇలా 60-94 ఏళ్ల మధ్య వయస్కులే వీరంతా. అక్షరాలు, పదాలు, పద్యాలు, అంకెలు, ఆటపాటలు నేర్చుకుంటున్నారు. ఇవన్నీ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయట. అంతేనా, బస్సుల మీద పేర్లు చదువుతున్నారు. తమ బ్యాంకు లావాదేవీలు తామే నిర్వహించుకుంటున్నారు. ఇది చాలదూ! నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని చెప్పడానికీ స్త్రీ సాధికారతకు చక్కని ఉదాహరణగా వివరించడానికీనూ!