
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రచారక్ కేవలం ఒక సామాజిక కార్యకర్త లేదా ఒక సైద్ధాంతిక నిర్దేశకుడు కాదు. అతడు ఒక రుషి. భారతమాత సేవకు అంకితమైన నిస్వార్థ జీవి. ప్రచారక్ తన వ్యక్తిగత సౌకర్యాలు, వృత్తి ఆశయాలు, కుటుంబ సంబంధాలను త్యజిస్తాడు. జాతీయ చైతన్యాన్ని మేల్కొల్పడానికి, వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి, ఎలాంటి ప్రచారంలేని, దృఢమైన చర్య ద్వారా సమాజాన్ని ఏకం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేస్తాడు.
ఆర్‌ఎస్‌ఎస్ దాని శతాబ్ది చరిత్ర అంతటా, దాని నిర్మాణం, అభివృద్ధి తాత్త్వికతలో ఒక ప్రాథమికమైన అంశంగా ప్రచారక్‌పై ఆధారపడింది. భారతదేశం అంతటా ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం, నిస్వార్థ ప్రయత్నాలను క్రమబద్ధమైన, స్థిరమైన పద్ధతిలో వ్యాప్తి చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్‌లోని ప్రచారక్‌ల అవసరాన్ని డాక్టర్ హెడ్గెవార్ గుర్తించారు. అప్పటి నుండి ప్రచారక్‌లు భారతదేశం అంతటా ఆర్‌ఎస్‌ఎస్ జాతీయత, క్రమశిక్షణ, సాంస్కృతిక ఐక్యత ఆదర్శాలను వ్యాప్తి చేసే కీలకమైన ప్రతినిధులుగా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ సంస్థకు తన పూర్తి సమయాన్ని వెచ్చిస్తాడు. అవివాహితుడిగా ఉంటాడు. అతడు స్వచ్ఛంద సేవకుడు. సంస్థ సిద్ధాంతం, కార్యకలాపాలకు అనుగుణంగా దేశానికి సేవ చేయడానికి తన మొత్తం జీవితాన్ని అంకితం చేస్తాడు.
ప్రచారక్‌లు చేస్తున్న సేవలకు వారికి ఎటువంటి వేతనం లేదా జీతం ఉండదు. ప్రచారక్ అనే పదం సంస్కృత భాష నుండి ఉద్భవించింది. ఇది ‘వ్యాప్తి చేయడం’ అనే అర్థాన్ని సూచిస్తుంది. ఇది సంస్థ జాతీయత, సామాజిక ఐక్యత, సాంస్కృతిక ఐక్యత సూత్రాలను ప్రోత్సహించడంలో వారి పనితీరును ప్రముఖం చేస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపితమైన నాలుగు సంవత్సరాల తరువాత 1929లో ప్రచారక్ వ్యవస్థ ప్రారంభమైంది. 1932లో బాబాసాహెబ్ ఆప్టే, దాదారావు పరమార్థ్, రాంభావు జామ్‌గడే, గోపాల్ రావు యెర్కుంట్వర్‌లతో నలుగురు ప్రచారక్‌లతో కూడిన ప్రారంభ బృందం స్థాపితమైంది. ప్రచారక్‌లు భౌతిక సుఖాలు, కుటుంబ బాధ్యతల నుండి విముక్తి పొంది, పూర్తిగా సామాజిక, సంస్థాగత పనులపై దృష్టి పెట్టడానికి కఠినమైన, క్రమశిక్షణతో కూడిన అస్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు శాఖలను (స్థానిక శిక్షణ కేంద్రాలు) నిర్మించడానికి, బలోపేతం చేయడానికి, స్వయంసేవకులలో సామాజిక సంక్షేమం, విద్య, సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి ప్రయత్నిస్తారు. నైతిక, సాంస్కృతిక పునరుజ్జీవనం ద్వారా బలమైన, స్వయం సమృద్ధిగల సమ్మిళితమైన భారత్‌ను స్థాపించడం వారి లక్ష్యం. వారి అవిశ్రాంత ప్రయత్నాలు నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలలో ఒకటిగా మార్చాయి. ప్రచారక్‌లు, స్వయంసేవకులు ఆర్‌ఎస్‌ఎస్ ప్రార్థన చేయడం ద్వారా భారత్‌ను తల్లిగా గౌరవిస్తారు. ఆమె పట్ల గౌరవం, భక్తి, సేవానిబద్ధతను వ్యక్తపరుస్తారు. ఇది మాతృభూమి సేవలో ఒకరి శరీరం, మనస్సు, జీవితాన్ని అంకితం చేసే తత్త్వాన్ని ప్రతిబింబిస్తుంది.
ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ జీవితం, పని
ప్రచారక్‌లు అత్యంత నిరాడంబరమైన, సామాన్యమైన జీవితాన్ని గడుపుతారు. తెల్లవారుజామున ప్రార్థన, యోగా, దేశభక్తి, ఆధ్యాత్మిక సాహిత్య అధ్యయనంతో వారి దైనందిన జీవితం ప్రారంభమవుతుంది. స్వయంసేవకులతో నిమగ్నమవ్వడం, శాఖలను సమన్వయం చేయడం, సామాజిక సేవా కార్యక్రమాలను పర్యవేక్షించడం, విద్య, సామాజిక ఐక్యత కోసం చర్చించడం, కార్యాచరణ కోసం పగటి సమయాన్ని అంకితం చేస్తారు. యువతలో వ్యక్తిత్వ వికాసం, సంఘీభావాన్ని పెంపొందించడానికి శాఖలు, ఆటలు, చర్చలను నిర్వహించడానికి సాయంకాలాన్ని వెచ్చిస్తారు. అదే సమయంలో చదవడం, ధ్యానంతోపాటు నివేదిక తయారు చేస్తారు. ప్రచారక్ కనీస జీవనశైలి ద్వారా, క్రమశిక్షణ, సేవ, అంకితభావం, సాంస్కృతిక జ్ఞానోదయ సూత్రాలకు అన్ని పనులను అంకితం చేస్తాడు. ఇది దేశం సమాజం పట్ల పూర్తి నిబద్ధతను ప్రదర్శిస్తుంది.
నిరాడంబరత, నిస్వార్థతను స్వీకరించిన ప్రచారక్ క్రమశిక్షణ కలిగిన, దేశభక్తిగల వ్యక్తులను పెంపొందించే క్రమంలో వ్యక్తిగత ఆకాంక్షలను తృణ ప్రాయంగా వదులుకుంటాడు. ప్రచారక్‌లు స్వయంసేవకులకు శారీరక శిక్షణ, నైతిక విలువలు, మేధో స్పష్టతను బోధించే శాఖలను (రోజువారీ సమావేశాలు) నిర్వహిస్తుంటారు. భారతీయ సంస్కృతి, ఐక్యత, సామాజిక శాంతిని అర్థం చేసుకోవడానికి వారు బౌద్ధిక్ (మేధో సమావేశాలు) నిర్వహిస్తుంటారు. భారతదేశం అంతటా అత్యవసర సమయాల్లో సహాయ కార్యక్రమాలకు కూడా వారు నాయకత్వం వహిస్తారు. ప్రచారక్‌లు ‘‘తన్, మన్, ధన్ సే దేశ్ సేవ’’ అనే మంత్రాన్ని సదా స్మరిస్తూ సేవ, త్యాగం,క్రమశిక్షణ విలువలకు కట్టుబడి ఉంటారు. డాక్టర్ హెడ్గెవార్, గురూజీ గోల్వాల్కర్ వంటి ఆర్‌ఎస్‌ఎస్ మార్గదర్శకులతో ప్రభావితమైన వారు, జాతీయ వ్యక్తిత్వ అభివృద్ధి, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం సంస్థ లక్ష్యానికి పునాదిగా ఉంటారు.
ఆర్‌ఎస్‌ఎస్ తన నెట్‌వర్క్, కార్యకలాపాలను పెంపొందించుకోవడానికి భారతదేశం అంతటా, వెలుపల ప్రచారక్‌లను నియమిస్తుంటుంది. అనేక మంది ప్రచారక్‌లు ఆర్‌ఎస్‌ఎస్ నుండి ప్రేరణ పొందిన అనుబంధ సంస్థలను స్థాపించడంలో లేదా మార్గదర్శకత్వం వహించడంలో సహాయం చేశారు. వాటిలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), భారతీయ జనసంఘ్ (బీజేఎస్), విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), సేవాభారతి మొదలైనవి ఉన్నాయి. స్వాతంత్య్రానంతర భారతదేశంలో, సేవాభారతి వంటి సామాజిక సంస్థల నుండి భారతీయ జనసంఘ్ (బీజేఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వంటి రాజకీయ సంస్థల వరకు అనేక జాతీయ సంస్థలలో ప్రచారక్‌లు కీలకమైన నిర్వాహకులుగా, నాయకులుగా ఉద్భవించారు.
నిషేధాలు, ప్రతికూలతలు ఉన్నప్పటికీ అంకితభావం, క్రమశిక్షణ, నైతిక ప్రవర్తన ద్వారా, ఆర్‌ఎస్‌ఎస్ ఔన్నత్యాన్ని, అఖండతను ప్రచారక్‌లు స్థాపించారు. పండిత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, ఏక్‌నాథ్ రనడే, అటల్ బిహారీ వాపేయి, నరేంద్ర మోదీ వంటి అనేక మంది ప్రముఖ భారతీయ నాయకులు ప్రచారక్‌లుగా తమ ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. క్రమశిక్షణ, సేవ, దేశభక్తిపై ఆధారపడిన నాయకత్వాన్ని పెంపొందించడంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావాన్ని ఇది వివరిస్తుంది.
బాధ్యతల్లో ప్రచారక్ సోపానక్రమం
ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రచారకుల సోపానక్రమం క్రమశిక్షణతో, నిర్మాణాత్మకంగా ఉంటుంది. ఇది అధికారం కంటే బాధ్యత, అనుభవం ఆధారంగా ఉంటుంది. ఇది అత్యున్నత స్థాయి నుండి అట్టడుగు స్థాయి వరకు నిర్మితమైనది. ఆర్‌ఎస్‌ఎస్ క్రమానుగత చట్రం స్థానిక స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు సమర్థవంతమైన సమన్వయాన్ని సులభతరం చేస్తుంది. సంస్థకు అత్యున్నత సైద్ధాంతిక, ఆధ్యాత్మిక నాయకుడు సర్‌సంఘ్‌చాలక్ సంస్థకు దృక్పథం, మార్గదర్శకత్వం, దిశానిర్దేశం చేస్తారు. సర్‌కార్యవాహ రోజువారీ పరిపాలనను పర్యవేక్షిస్తూ, భారతదేశం అంతటా అన్ని కార్యకలాపాలను సమన్వయం చేస్తారు. సహ-సర్‌కార్యవాహలు సంస్థ, శిక్షణ, కమ్యూనికేషన్ సహా నిర్దిష్ట పోర్ట్‌ఫోలియోలను నిర్వహిస్తారు. అఖిల భారతీయ ప్రముఖ్‌లు భారత దేశం అంతటా సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించే, నిర్దేశించే జాతీయ ఆఫీస్ బేరర్లు. వారు పరిపాలన, భావజాలం, శిక్షణ, సమన్వయానికి సంబంధించి ముఖ్యమైన బాధ్యతలను చూసుకునే జ్యేష్ఠ ప్రచారక్‌లు.
క్షేత్ర ప్రచారక్ వివిధ రాష్ట్రాలు లేదా ప్రాంతాలలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తాడు. అయితే ప్రాంత ప్రచారక్ ఒక నిర్దిష్ట రాష్ట్రంలో కార్యకలాపాలను నిర్దేశిస్తాడు. ప్రాంత, జిల్లా కార్యకర్తలకు నాయకత్వం వహిస్తాడు. విభాగ్ ప్రచారక్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అనేక జిల్లాలను పర్యవేక్షిస్తాడు. అయితే జిల్లా ప్రచారక్ ఒక జిల్లాలోని అన్ని కార్యకలాపాలను నిర్వహిస్తాడు. ఒక జనసమూహం స్థాయిలో, నగర్ లేదా ఖండ ప్రచారక్ నేరుగా శాఖలతో (రోజువారీ సమావేశాలు) సహకరిస్తాడు.
స్వయంసేవకులకు బోధన, ప్రేరణ ఇస్తాడు. ఈ వ్యవస్థ పునాదిలో స్థానిక శాఖలు, సేవా కార్యక్రమాలు, సామాజిక ప్రాజెక్టులలో పాల్గొనే నిబద్ధత కలిగిన స్వయంసేవకులు ఉంటారు. ఈ బహుళ-స్థాయి సోపానక్రమం ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను క్రమశిక్షణతో, సమన్వయంతో, సమర్థవంతమైన కమ్యూనికేషన్‌తో సులభతరం చేస్తుంది.
ప్రతి స్థాయి ఒకదానితో మరొకటి అను సంధానమై ఉంటుంది. సంస్థ సూత్రాలు, నిర్ణయాలు, సేవా కార్యక్రమాలు జాతీయ నాయకత్వం నుండి అట్టడుగు వర్గాలకు సజావుగా చేరుతాయని హామీ ఇస్తుంది. ఇది జాతీయ వ్యక్తిత్వ అభివృద్ధి, సామాజిక సమైక్యత పట్ల ఆర్‌ఎస్‌ఎస్ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది.
ముక్తాయింపు
ఒక ప్రచారక్ నిస్వార్థమైన అంకితభావం, సంస్థాగత నిబద్ధత, వ్యక్తి కంటే దేశానికి ప్రాధాన్యత ఇవ్వడం అనే సూత్రాన్ని కలిగి ఉంటాడు. భారత్ సాంస్కృతిక, సామాజిక పటిష్టతకు నిరంతరం పాటుపడుతుంటాడు. దాదాపు ఒక శతాబ్దం పాటు వ్యక్తిగత ప్రయోజనాలకు బదులుగా దేశానికి తనను తాను అంకితం చేసుకోవడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ సారాంశాన్ని ప్రతిబింబిస్తుంటాడు. ప్రచారక్‌లు మూడో కంటికి కనిపించకుండా చేస్తున్న అచంచల మైన ప్రయత్నాలు సమకాలీన భారత్‌లో సామాజిక, సాంస్కృతిక వాతావరణాన్ని సృష్టించడంలో ఆర్‌ఎస్‌ఎస్ అస్తిత్వపు ప్రభావానికి భరోసా ఇస్తున్నాయి.
ఈ ప్రచారక్‌లు సమష్టిగా ఆర్‌ఎస్‌ఎస్ ను చిన్న స్వచ్ఛంద సంస్థ నుండి భారత దేశంలో అత్యంత ప్రభావవంతమైన సామాజిక-సాంస్కృతిక సంస్థలలో ఒకటిగా మార్చారు. వారు ప్రయత్నాలు చేస్తున్న వాటిలో విద్య, గ్రామీణాభివృద్ధి, శ్రామికుల హక్కులు, జాతీయ ఐక్యత, రాజకీయ అవగాహన ఉన్నాయి. ప్రచారక్‌లు సేవ, సంఘటన్ (ఐక్యత), సంస్కార్ (విలువలు) ఆదర్శాలను సమర్థించడం ద్వారా, ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్రలో పాతుకు పోయిన స్థితిస్థాపక, సంఘటిత, స్వావలంబన భారత్ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకొని వెళుతున్నారు. అందువల్ల, ప్రచారక్‌లు వారి నిస్వార్థ సేవ, భారతమాత పట్ల అంకితభావం కారణంగా నిజమైన అర్థంలో రుషులుగా అవతరిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా, మన సమాజం కోసం, దేశం కోసం జీవితాలను అంకితం చేసిన రుషులందరినీ స్మరించుకోవడం మన నైతిక కర్తవ్యం.
(‘ఆర్గనైజర్’ సౌజన్యంతో)





