
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా ముల్లేశ్వర్ గ్రామానికి చెందిన బృందావన్ మాలిక్ (40) ప్రతినెలా బాలేశ్వర్ నుంచి పూరీకి 260 కి.మీ. సైకిల్ యాత్ర చేస్తున్నారు. చుట్టుపక్కల పది గ్రామాల భక్తుల నుంచి సేకరించిన తులసి కొమ్మలను ఈయన పురీ జగన్నాథుడి సేవకు తీసుకువెళ్తున్నారు. చాట్ భండార్ వ్యాపారం చేసే మాలిక్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. జగన్నాథుడి భక్తుడైన ఈయన ప్రతినెలా 20వ తేదీన బాలేశ్వర్ నుంచి సైకిలుపై బయలుదేరుతారు. సేకరించిన తులసి కొమ్మలను బుట్టల్లో నింపి కొబ్బరికాయలు, పూలను వెంట తీసుకువెళతారు. రెండు రోజుల ప్రయాణంలో మార్గమధ్యంలోని దేవాలయాలు, మఠాల్లో రాత్రి బస చేస్తారు. ‘‘సమాజ శ్రేయస్సు కోసం నేను ఈ యాత్ర చేస్తున్నాను. పురీకి వెళ్లలేనివారు నా ద్వారా తులసి, ఇతర వస్తువులను పంపుతారు’’ అని మాలిక్ తెలిపారు. ఈ సైకిల్ యాత్రలో ఇప్పుడు తన్మయ్ ప్రధాన్ (20) అనే మరో యువకుడు జత కలిశారు.





