ArticlesNews

ఒకప్పటి ఇంటి పనులే నేటి వ్యాయామాలు

104views

మహిళలు ఎక్కువగా వంటగదులకే పరిమితమైనా… అదే వారికి జిమ్‌… ఇంటి వరండాలే వాకింగ్‌ ట్రాక్‌.. విసుర్రాయి, రుబ్బురోలు వంటివే డంబెల్స్‌… ఇవన్నీ కలిపి ఒంటికి శ్రమనందించేవి. దాంతో సహజంగానే వాళ్లు ఆరోగ్యంగా, దృఢంగా ఉండేవారు. 

ఇప్పుడు…
సౌకర్యాలు పెరిగాయి. చిటికెలో పనులు పూర్తిచేసే గ్యాడ్జెట్లు, మెషీన్లు ఎన్నో వచ్చాయి. దాంతో శారీరక శ్రమ తగ్గింది. అనారోగ్యాలు పెరిగాయి. ఫలితంగా ఫిట్‌నెస్‌ కోసం… జిమ్‌లకు, యోగా సెంటర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. రకరకాల వ్యాయామాలను సాధన చేస్తున్నాం. అయితే, వాటిని ఎప్పుడైనా శ్రద్ధగా గమనించారా? మన అమ్మమ్మలు, నానమ్మలు అలవోకగా చేసిన ఇంటి పనులే అవన్నీ. ఎందుకిలా? ఇంతకీ ఆ పనులు అందించే ఫలితాలేంటి? ఇప్పుడు వాటినెలా చేయొచ్చు? తెలుసుకుందామా…

మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబమూ ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాయామం అంటే జిమ్‌లో చెమటోడ్చడం మాత్రమే కాదు…  మన శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం. ఇందుకు పాతకాలం ఇంటి పనుల్లో దాగి ఉన్న సైన్స్‌ను అర్థం చేసుకుంటే, ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే, ఇప్పుడవి… యోగా మ్యాట్‌పైన, జిమ్‌ ఫ్లోర్‌పైన, డాన్స్‌ స్టేజ్‌పైన కొత్త రూపంలో కనిపిస్తున్నాయి. ఇంతకీ అవేంటో తెలుసా…

1. తిరగలి విసరడం
పూర్వం పొలం నుంచి నేరుగా తెచ్చిన ధాన్యపు గింజలు, కందులు, పెసలు, మినుములు వంటివాటిని తిరగలితో విసిరేవారు. వాటిని పప్పులుగా, పిండిగా మార్చేవారు. ఇందుకోసం కాళ్లు చాచి కూర్చుని, బలమంతా ఉపయోగించి తిరగలిని గుండ్రంగా తిప్పేవారు. దీన్నే ‘చక్కీ చలనాసనం’ అని పిలుస్తున్నాం. ఇది పొట్ట దగ్గర కొవ్వును తగ్గించి, వెన్నెముకను దృఢంగా ఉంచుతుంది. అదే పిండి రుబ్బడానికి బదులుగా కోర్‌ రొటేషన్‌/ఆబ్లిక్‌ ట్విస్ట్స్‌ వంటివాటిని ఎంచుకుంటున్నాం. ఈ పని నడుము చుట్టూ ఉన్న కొవ్వుని కరిగిస్తుంది. వెన్నెముక ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది.

2. దంచడం
అమ్మమ్మల తరంలో ఇంటిల్లిపాదికి అవసరమైన ఆహారం కోసం..రోట్లో పప్పులు, వడ్లు వంటివి వేసి దంచేవారు. ఇందుకోసం బరువైన రోకలిని పైకెత్తి సులువుగా కిందకు దించేవారు. ఈ పనులకు కనీసం గంటైనా సమయం పట్టేది. ఇవి చేతులు, భుజాలకు మంచి వ్యాయామాన్ని అందించేవి. వీటినే ఇప్పుడు వెయిట్‌ లిఫ్టింగ్‌ కసరత్తులు అంటున్నారు. స్ట్రెచెస్, బాటిల్‌ రోప్స్, డంబెల్‌ ఓవర్‌హెడ్స్‌ ప్రెస్‌… వంటివి చేతులు, భుజాల కండరాల దృఢత్వం కోసం చేస్తున్నారు.

3. ఊడ్చడం- ముగ్గులు పెట్టడం
ఒకప్పుడు మహిళల దినచర్య… తెల్లవారు జామునే లేచి ఇల్లూ వాకిలీ ఊడ్చడంతోనే మొదలయ్యేది. ఆపై గుమ్మం ముందు కళ్లాపి చల్లి ముగ్గులు పెట్టేవారు. ఇది ఒకరకంగా ‘మలాసనం’ లాంటిదే. ఇది జీర్ణక్రియకు నడుము కింది భాగాన్ని, కాళ్లను దృఢంగా మారుస్తుంది.

4. బట్టలు ఉతకడం
ఇప్పుడంటే వాషింగ్‌ మెషీన్లు వచ్చాయి కానీ… ఒకప్పుడు అందరం దుస్తుల్ని చేత్తోనే ఉతికేవాళ్లు. ముఖ్యంగా వాటిని బలంగా ఎత్తి బండకేసి కొట్టడం, చేతులతో రుద్దడం, వంగి దుస్తుల్ని నీళ్లల్లో జాడించడం, గట్టిగా పిండి ఆరేయడం వంటి పనులన్నీ శ్రమను కలిగించేవే. ఇలానే ‘ఉత్తానాసనం’ చేతుల కండరాలకు బలాన్నీ, ఇతర శరీర భాగాలకు స్ట్రెచ్‌నీ ఇస్తుంది.

మరికొన్ని..: స్క్వాట్స్, సిటప్స్‌కి బదులుగా తడిబట్ట పెడితే… కాళ్లు, తుంటి భాగం బలపడతాయి. అలానే ఇప్పుడు నీళ్లు తోడటానికి బావులు లేవు కదా! అందుకే కాసేపు డెడ్‌లిఫ్ట్స్, లాట్‌ పుల్‌డౌన్‌… వంటివి చేయండి. వెన్నెముక, భుజాల బలంతోపాటు కోర్‌ స్టెబిలిటీ మెరుగవుతుంది.

అలాగని… ‘ఈ రోజుల్లో మహిళలు ఇంట్లో పనులు చేయడం మానేశారు’ అనకండి. స్త్రీలకు కొత్త బాధ్యతలు వచ్చి చేరాయి. పైగా చిన్న కుటుంబాలు… ప్రతి పనికీ గ్యాడ్జెట్‌ తప్పనిసరి. దాంతో ఫ్లెక్సిబిలిటీ తగ్గి, బరువూ పెరుగుతున్నారు. కాబట్టి ఆ పనులు చేయలేనప్పుడు ఈ వ్యాయామాలు చేయాల్సిందే కదా!