News

మధ్యప్రదేశ్‌లోని సిహోరా హిందూ ఆలయంపై దాడి

110views

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లా సిహోరా పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హిందూ, ముస్లింలకు చెందిన ప్రార్థనా స్థలాలు పక్కపక్కనే ఉన్న ఆజాద్‌చౌక్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఎవరూ గాయపడలేదని అధికారులు చెబుతున్నారు. అయితే శుక్రవారం పట్టణంలోని అధికభాగం దుకాణాలు మూసి ఉన్నాయి. రాత్రి హారతి కార్యక్రమం జరుగుతున్న సమయంలో తమ ప్రార్థనా స్థలానికి చెందిన ప్రవేశ ద్వారాన్ని కొందరు దుండగులు పగులగొట్టారని హిందువులు చెబుతుండగా, పవిత్ర మాసం ప్రారంభ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలు, హారతి కార్యక్రమం ఒకేసారి ప్రారంభం కావడం ఉద్రిక్తతలకు దారి తీసిందని ముస్లిం వర్గం చెబుతోంది. పరిస్థితిని అదుపు చేసేందుకు బాష్పవాయు గోళాలు ప్రయోగించాల్సి వచ్చిందని ఎస్పీ సంపత్‌ ఉపాధ్యాయ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ 49 మందిని అరెస్టు చేశామని అదనపు ఎస్పీ సూర్యకాంత్‌ శర్మ తెలిపారు. ఇరు వర్గాలూ పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయని, ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే రాళ్లు రువ్వారనడంలో వాస్తవం లేదని జిల్లా కలెక్టరు రాఘవేంద్ర సింగ్‌ తెలిపారు.