
( ఫిబ్రవరి 21 – అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం )
మనిషి జీవితంలో మొదట నేర్చుకునేది మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఏ విధంగా పిలుస్తాడో మాతృభాష కూడా అలాంటిదే. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగానే వస్తుంది. అమ్మ అంటే మాతృభాష. అందుకే బిడ్డ అమ్మను కాపాడుకున్నట్లే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు తమ మాతృభూమిని, సంస్కృతిని, మాతృభాషను గౌరవించాలని అవి మనకు ఆనందాన్ని కలిగించేవని ఋగ్వేదం చెబుతోంది.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి మన దేశం నుంచి విడిపోయిన ముక్కలే కారణం. ప్రస్తుత బంగ్లాదేశ్ ఒకప్పుడు తూర్పు పాకిస్థాన్‌గా, ఇప్పటి పాక్‌లో అంతర్భాగంగా ఉండేది. 1948లో ఉర్దూను జాతీయ భాషగా పాకిస్థాన్ ప్రకటించింది. ఉర్దూతో పాటు బెంగాలీని కూడా జాతీయ భాషగా ప్రకటించాలని బంగ్లాదేశ్ ప్రాంతంలో డిమాండ్లు మొదలై ఉద్యమ రూపు దాల్చింది. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి చేసిన ప్రయత్నాల్లో 1952 ఫిబ్రవరి 21న ఎంతో మంది మరణించారు. మరెంతో మంది గాయపడ్డారు. మాతృభాష కోసం మన పొరుగుదేశంలో జరిగిన ఈ త్యాగాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. ఫలితంగా బంగ్లా భాషా ఉద్యమం, మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకొని యునెస్కో ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
ప్రతి ఏడాది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి ఓ ఇతివృత్తాన్ని యునెస్కో ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలను యునెస్కో కొనసాగిస్తోంది. ఇది భాషా వైవిధ్యాన్ని రక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి 25 సంవత్సరాల ప్రపంచ ప్రయత్నాలను సూచిస్తుంది. అమ్మపాల వంటి అమ్మభాషను చిన్నతనంలోనే విద్యార్థులకు నేర్పటం ద్వారా, అదే భాషలో విజ్ఞానాన్ని అందించడం ద్వారా వారి వృద్ధి వేగవంతం అవుతుందని సి.వి.రామన్ వంటి శాస్త్రవేత్తలు నొక్కి చెప్పారు. మన మాతృభాషలో ఉన్న విజ్ఞాన భాండాగారాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భాష, సంస్కృతి ఎప్పుడూ ముడిపడి ఉంటాయి. అన్నమయ్య సంకీర్తనలు ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూనే వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తాయి. వాన వాన వల్లప్పా అంటూ వానను ఆహ్వానించే సంస్కృతి మనదైతే…రెయిన్ రెయిన్ గో అవే అంటూ వాన వద్దని చెప్పే సంస్కృతి ఆంగ్లానిది. మన వ్యవసాయ దేశానికి వానలు కావాలి. అందుకే మన సంస్కృతి బతకాలి అంటే మన భాషను కాపాడుకుని, మన ముందు తరాలకు సగర్వంగా అందించాలి.





