News

రైల్వే స్టేషన్‌పై డెకొరేటివ్ డ్రోమ్.. నమాజ్ చేసిన ముస్లింలు.. రాత్రికిరాత్రే తొలగింపు

235views

ఉత్తర ప్రదేశ్, గోరఖ్‌పూర్ పరిధిలో వివాదాదస్పద ఘటన జరిగింది. పిప్రాయిచ్ రైల్వే స్టేషన్‌ పైభాగంలో మధ్యలో ఒక డెకొరేటివ్ డ్రోమ్ ఏర్పాటైంది. పైగా.. అది గ్రీన్ కలర్‌లో ఉండటంతో కొంతమంది ముస్లింలు దాని కింద నమాజ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఈ అంశంపై స్తానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు ఈ అంశం వివాదాదస్పదంగా మారింది.

గోరఖ్‌పూర్ కంటోన్మెంట్-పనియాహ్వా మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. చాలా చోట్ల స్టేషన్ బిల్డింగ్స్, ప్లాట్‌ఫామ్స్ వంటివి కూల్చేసి, కొత్తవి కడుతున్నారు. దీనిలో భాగంగా వారణాసి డివిజన్, పిప్రాయిచ్ స్టేషన్ పరిధిలో పాత బిల్డింగ్ కూల్చి, కొత్తగా ఒక బిల్డింగ్ కడుతున్నారు. ఈ బిల్డింగ్‌పై అలంకరణ కోసం ఒక డోమ్‌లాంటి నిర్మాణం చేపట్టారు. దీని పైభాగంలో గ్రీన్ కలర్‌లో షీట్ ఏర్పాటు చేశారు. దీంతో ఇది చూడటానికి అచ్చం మసీద్‌లాగా కనిపించింది. అంతే.. ఇటీవల కొందరు దీని కింద నమాజ్ చేయడం ప్రారంభించారు. దీనిపై స్థానికులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు.

మీడియాలో వార్తలు రావడం, స్థానికులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రైల్వే అధికారులు వేగంగా స్పందించారు. రాత్రిపూట ఆ డోమ్ తొలగించారు. దీంతో వివాదం దాదాపు సద్దుమణిగింది. అయితే, అసలు ఇక్కడ మసీదుపైన ఉండే డోమ్ లాంటి నిర్మాణం చేపట్టింది ఎవరు.. దీనికి అనుమతులిచ్చింది ఎవరు అనే అంశంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.