ArticlesNews

తెలుగు కాశీ

132views

పరమశివుడు ఓ నగరంగా ఆవిర్భవిస్తే… అది కాశీ క్షేత్రమే అవుతుంది. ఆ మహాశ్మశానం లయకారుడి క్రీడాస్థలి! ప్రపంచ నాగరికతలు పురుడుపోసుకోక ముందే… ఇక్కడ సనాతన సంస్కృతి పరిఢవిల్లింది. భక్తి, ముక్తి, భుక్తి… ఎవరు ఏ కారణంతో వెళ్లినా ప్రేమగా అక్కున చేర్చుకుంటుంది ఆ ఆధ్యాత్మిక రాజధాని. మొత్తంగా, శివతత్వ తేజోరాశి… కాశీ!

అటువంటి కాశీకి తెలుగు వారికీ ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది తెలుగువారు శివదీక్షాపరులు, నమకచమకాలు మనవాళ్ల నాలుకల మీద నాట్యం చేస్తుంటాయి. పారవశ్యంతో శివతాండవ స్తోత్రం అందుకుంటే ఆదియోగి నటరాజుగా మారిపోవడం ఖాయం. పూర్వం కాశీ పాండాలు తెలుగు పండితులు కనిపించగానే సగౌరవంగా దారి ఇచ్చేవారట. అప్పట్లో మన సరస్వతీపుత్రుల చదువుల మజిలీ కూడా ఉత్తర ప్రదేశ్‌లోని కాశీ నగరమే. స్నాతకోత్సవం తర్వాత, విశ్వేశ్వరుడిని వదిలిరాలేక అక్కడే స్థిరపడ్డారు కొంతమంది.

మానవల్లి గంగాధరశాస్త్రి అందులో ఒకరు. ఆయనకు నడిచే సనాతన ధర్మమని పేరు. బ్రిటిష్‌వారికి ఏ సందేహం వచ్చినా గంగాధరశాస్త్రి ముందు వాలిపోయేవారు. దండిభొట్ల విశ్వనాథశాస్త్రిని అపర విశ్వనాథుడని పిలిచేవారు. జర్మనీ పండితులు ఆయన దగ్గర అథర్వణ వేదం నేర్చుకున్నారట. కాశీ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు మదనమోహన్‌ మాలవీయకు అత్యంత సన్నిహితులు వెంపటి నాగభూషణం. ఇప్పటికీ అక్కడ తెలుగువారి ఇంటిపేర్లతో అనేక వీధులు కనిపిస్తాయి.

తెలుగు సాహిత్యంలో కాశీ స్థానం ఎంతో గొప్పది. శ్రీనాథుడి కాశీఖండం సుప్రసిద్ధం. ఏనుగుల వీరాస్వామి ‘కాశీ యాత్ర చరిత్ర’ తొలి తెలుగు యాత్రా సాహిత్యం. విజయనగర సంస్థానాధీశులకు కాశీ విశ్వనాథుడంటే మహాభక్తి. నారాయణ గజపతి దాదాపు నలభై ఏళ్లు కాశీలోనే గడిపారు, అక్కడే మరణించారు. సర్‌ విజ్జీగా సుప్రసిద్ధులైన విజయానంద గజపతి ఏకంగా కాశీ పౌరసత్వం తీసుకున్నారు. విజయనగర పాలకుల పేరుతో ఇప్పటికీ అక్కడ ఓ ఘాట్‌ ఉంది. ఎంతోకొంత ప్రశస్తి ఉన్న ప్రతి క్షేత్రాన్నీ ‘దక్షిణ కాశి’గా పిలుచుకుని మురిసిపోతారు తెలుగు ప్రజలు.