News

‘7 సిస్టర్స్‌’పై యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు

153views

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ పదవి నుండి తప్పుకుంటున్న తరుణంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత్‌లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన వీడ్కోలు ప్రసంగంలో ఆయన భారత్‌లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్‌’ను పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్‌లతో కలిపి ప్రస్తావించడం గమనార్హం. భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో యూనస్ వ్యాఖ్యలు మరింత విదాస్పదంగా మారాయి.

భారత అంతర్భాగమైన ఈ రాష్ట్రాలను సార్వభౌమాధికారం గల దేశాలతో పోలుస్తూ, సరిహద్దుల రేఖలను చెరిపివేసే ప్రయత్నం చేశారని విశ్లేషకులు యూనస్‌పై మండిపడుతున్నారు. తన 18 నెలల పాలనా కాలంలో బంగ్లాదేశ్ విదేశాంగ విధానం ఏ దేశానికీ లొంగి ఉండలేదన్నారు. దేశ సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా సాగిందని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సముద్ర తీరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానానికి ఒక బహిరంగ ద్వారమని యూనస్ అభివర్ణించారు.

నేపాల్, భూటాన్, భారత ఈశాన్య రాష్ట్రాలతో కలిసి ఈ ప్రాంతం గొప్ప ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉందని యూనస్‌ పేర్కొన్నారు. భారత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా కేవలం ‘సెవెన్ సిస్టర్స్’ అని సంబోధించడం ద్వారా భారత్ పట్ల తనకున్న వ్యూహాత్మక వైఖరిని ఆయన ప్రదర్శించారు. ఇది నూతన ప్రభుత్వ హయాంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాల పునరుద్ధరణపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 2024లో బాధ్యతలు చేపట్టిన యూనస్ యంత్రాంగం ఇప్పుడు తారిఖ్ రెహ్మాన్‌ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి అధికారాన్ని అప్పగిస్తోంది. ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో 297 సీట్లకు గాను 209 స్థానాలను గెలుచుకున్న బీఎన్‌పీ నేడు (మంగళవారం)ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

తన హయాంలో చైనా, జపాన్, అమెరికా, ఐరోపా దేశాలతో సంబంధాలను బలోపేతం చేశామని యూనస్ తెలిపారు. ముఖ్యంగా చైనా సహాయంతో తీస్తా నది ప్రాజెక్టు, నీల్‌ఫామరి ఆస్పత్రి ప్రాజెక్టులలో పురోగతి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే సుమారు 130 కొత్త చట్టాలను రూపొందించామని, సైనిక ఆధునీకరణ ద్వారా ఏ రకమైన దురాక్రమణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యామని ఆయన వివరించారు.

మరోవైపు యూనస్ పాలనలో భారత్‌తో సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. బంగ్లాదేశ్‌లో హిందువులతో సహా మైనారిటీలపై జరుగుతున్న దాడులు, శాంతిభద్రతల వైఫల్యంపై భారత్‌ పదేపదే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక సంబంధాలపై కూడా ప్రభావం చూపాయి. దేశీయంగా కూడా మైనారిటీల రక్షణ, ప్రజాస్వామ్య పరివర్తన విషయంలో యూనస్ ప్రభుత్వం అనేక విమర్శలను ఎదుర్కొంది.