News

పంచశీల ఒప్పందం అందుకే చేసుకోని ఉండవచ్చు

133views

స్వాతంత్ర్యం తర్వాత భారత్‌-చైనా సంబంధాల గురించి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కోసమే అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1954లో పంచశీల ఒప్పందం చేసుకొని ఉంటారన్నారు. దేహ్రాదూన్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీడీఎస్‌.. భారత్‌-చైనా చారిత్రక సంబంధాలపై ప్రసంగించారు. ఆ ఒప్పందంలో భాగంగానే టిబెట్‌ను చైనాలో భాగమని భారత్‌ గుర్తించిందన్నారు.

‘‘బ్రిటిషర్లు వెళ్లిపోయిన తర్వాత.. సరిహద్దు ప్రాంతాలను నిర్ణయించుకునే అవకాశం భారత్‌కు వచ్చింది. తూర్పున మెక్‌మోహన్‌ రేఖ, లద్దాఖ్‌లోని ప్రాంతాల గురించి నెహ్రూకు అవగాహన ఉండి ఉండొచ్చు. కానీ, ఈ ప్రదేశంపై (టిబెట్‌ సరిహద్దు ప్రాంతం) కాదు. అందుకే ఆయన చైనాతో పంచశీల ఒప్పందంపై ముందుకెళ్లారని భావిస్తున్నా.

ఇదే చైనీయుల విషయానికొస్తే.. టిబెట్‌ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని వారు సరిహద్దుల నుంచి లాసా (టిబెట్‌లోని నగరం), షిన్‌జియాంగ్‌లకు వెళ్లిపోయారు. ఈ ప్రత్యేక ప్రాంతం రెండు దేశాలకు ఎంతో ముఖ్యమైనదిగా మారింది. అందుకే చైనీయులు ఇక్కడ స్థిరత్వాన్ని కోరుకున్నారు. ఆ సమయంలో భారత్‌ కూడా చైనాతో మంచి సంబంధాలు కొనసాగించాలని భావించింది. ఈ క్రమంలోనే 1954లో టిబెట్‌ను చైనాలో భాగంగా గుర్తించింది. పంచశీల ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి’’ అని సీడీఎస్‌ చౌహాన్‌ వివరించారు.

పొరుగు దేశాలు ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని, శాంతియుతంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో భారత్‌-చైనాల మధ్య 1954లో పంచశీల ఒప్పందం (ఐదు సూత్రాలు) జరిగింది. నాటి భారత ప్రధాని నెహ్రూ, చైనా ప్రధాని చౌ ఎన్‌లైలు సంతకాలు చేశారు. అయితే, చైనా వైఖరి చూస్తుంటే ఈ ఒప్పందం కేవలం వాణిజ్యం కోసమేనని అర్థమవుతోందని.. సరిహద్దు అంశంలో ఇది ఏమాత్రం ప్రతిబింబించలేదని సీడీఎస్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ.. వాస్తవాధీన రేఖ (LAC) సున్నిత ప్రాంతంగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.