
జన్మనిచ్చిన అమ్మలాంటి ధరిత్రిని రసాయనాలతో చిక్కిశల్యం చేయొద్దని రైతులకు చినజీయర్ స్వామి సూచించారు. సుఫల రైతు పాదయాత్ర రెండోవిడతను కృష్ణా జిల్లా మోపిదేవిలో బుధవారం ప్రారంభించి, 7 గ్రామాల్లోని పొలాల మీదుగా 8 కిలోమీటర్లు నడిచి అయోధ్య గ్రామంలో ముగించారు. మన మట్టి, మన ఆరోగ్యం, భూ పరిరక్షణ కోసం రైతుల్లో చైతన్యం తీసుకురావడం ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. పాలేకర్ సూచించిన ప్రకృతి వ్యవసాయ విధానాన్ని పాటించేలా రైతుల్లో మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో తాను చేస్తున్న కృషికి తోడ్పాటు ఇవ్వాలన్నారు. మన్నును అన్నంగా మార్చే రైతు పాదమే రామ పాదంగా పంట పొలాలు వేలమంది పాదస్పర్శతో పునీతమై మార్పునకు నాందిగా మారాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం పలికామన్నారు. ప్రకృతి వ్యవసాయదారు విజయరామ్, కృష్ణామిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, కోనేరు కరుణాకర్‌లు ఈ యజ్ఞంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు.




