
స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1980 మరియు 1990వ దశాబ్దాలు అత్యంత చీకటి అధ్యాయాలుగా నిలిచిపోయాయి. 1971 యుద్ధంలో పరాజయం మరియు బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత, పాకిస్థాన్ నేరుగా యుద్ధం చేసే పద్ధతిని విడనాడి, భారత్‌ను లోపలి నుండి బలహీనపరచడానికి ‘K2’ (కాశ్మీర్-ఖలిస్థాన్) వ్యూహాన్ని ఎంచుకుంది. దీనివల్ల పంజాబ్‌లో వేర్పాటువాద హింస చెలరేగగా, కాశ్మీర్‌లో పండిట్ల దారుణమైన ‘జాతి నిర్మూలన’ (Ethnic Cleansing) జరిగింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా, అప్పట్లో అమెరికా భారత ఆవేదనను కేవలం ఒక “శాంతిభద్రతల సమస్య”గా కొట్టిపారేసింది. 1999లో జరిగిన IC-814 విమానం హైజాక్ ఘటన వాషింగ్టన్‌ను కొంత ఉలిక్కిపడేలా చేసింది. ఫలితంగా 2000లో ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పరిమిత సహకారం మొదలైంది. అయినప్పటికీ, 9/11 దాడులు జరిగే వరకు అమెరికా స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. ఆ దాడులు జరిగిన తర్వాతే అమెరికా తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.
అయితే విచిత్రమేమిటంటే, ఆ తర్వాత ఏళ్లలో కూడా భారత్‌పై సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, అమెరికా పాకిస్థాన్‌కు నిధులు సమకూర్చడం కొనసాగించింది. ఒక ఉగ్రవాద దేశమని తెలిసి కూడా వాషింగ్టన్ ఎందుకు పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తోంది? ఈ నివేదిక ఆ ప్రశ్నకే సమాధానం వెతకడానికి ప్రయత్నిస్తుంది.
వ్యూహాత్మక అంధత్వం (The Era of Strategic Blindness)
1980లు మరియు 90ల కాలంలో, భారతదేశం ఉగ్రవాద కోరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయ్యింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సాధారణ భారతీయ పౌరులను బలితీసుకున్నారు. అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి బె అంత్ సింగ్ హత్యలో కూడా పాకిస్తానీ ఉగ్రవాదుల ప్రమేయం బయటపడింది. అంతేకాకుండా, ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో మరియు 1990లలో కాశ్మీర్‌లో పాకిస్తాన్ అండతో సాగిన రక్తపాతం వంటి ఘటనల సమయంలో, అగ్రరాజ్యం అమెరికా మౌనంగానే ఉండిపోయింది. ఆ రోజుల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలపై భారతదేశం గళమెత్తినప్పటికీ, ఎటువంటి స్పందన రాలేదు. అప్పట్లో అమెరికా దృష్టిలో భారతదేశం ఉగ్రవాద బాధితురాలిగా కనిపించలేదు, కేవలం ‘పొరుగు దేశంతో సమస్యలు’ ఉన్న దేశంగా మాత్రమే కనిపించింది. ఆ రోజుల్లో అమెరికా అనుసరించిన ‘వ్యూహాత్మక ముసుగు’ (Strategic Mask) భారతదేశానికి శాపంగా మారింది. అయితే, డిసెంబర్ 24, 1999న IC-814 విమానం హైజాక్ ద్వారా భారతదేశం మరోసారి లక్ష్యంగా మారినప్పుడు, అమెరికా చివరకు మేల్కొంది. దీని ఫలితంగా, ఫిబ్రవరి 8, 2000న భారతదేశంతో కలిసి ఉగ్రవాద వ్యతిరేక ఉమ్మడి పోరాటానికి అమెరికా మొదటి అడుగు వేసింది. అయినప్పటికీ, అప్పట్లో అమెరికా చర్యలు అంత బలంగా ఏమీ లేవు. కానీ ఎందుకు?

ఆపరేషన్ సైక్లోన్: ప్రచ్ఛన్న యుద్ధం చేసిన పాపం
అమెరికా పాటించిన ఈ వ్యూహాత్మక మౌనం యొక్క మూలాలు ‘ప్రచ్ఛన్న యుద్ధం’ (Cold War)లో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌పై సోవియట్ యూనియన్ దండయాత్ర చేసిన తర్వాత, వారిని ఓడించడానికి వాషింగ్టన్‌కు ఒక మధ్యవర్తి (Proxy) అవసరమైంది. ఆ మధ్యవర్తే పాకిస్తాన్. 1970ల చివరలో మరియు 1980లలో, అమెరికా ‘ఆపరేషన్ సైక్లోన్’ను ప్రారంభించింది. ఇది అప్పటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ హయాంలో మొదలై, అతని జాతీయ భద్రతా సలహాదారు జ్బిగ్నివ్ బ్రజెజిన్స్కీ వ్యూహరచనలో రూపుదిద్దుకున్న ఒక రహస్య కార్యక్రమం. అమెరికా ఈ పాకిస్తాన్ ద్వారానే ఆఫ్ఘన్ ముజాహిదీన్ పోరాట యోధులకు బిలియన్ల కొద్దీ డాలర్లు, ఆయుధాలు మరియు శిక్షణను గుట్టుచప్పుడూ కాకుండా అందించింది. అమెరికా నేరుగా చేయకూడదనుకున్న ఈ ప్రాక్సీ యుద్ధంలో, ఆ వ్యక్తులకు ఆయుధాలిచ్చి, వారిని వ్యవస్థీకృతం చేసి, ‘స్వేచ్ఛా పోరాట యోధులు’గా కీర్తించింది.
చివరకు 1989లో సోవియట్ దళాలు అఫ్ఘన్ నుంచి ఉపసంహరించుకున్నప్పుడు, వాషింగ్టన్ (అమెరికా) విజయాన్ని ప్రకటించుకుంది. తర్వాత అక్కడి నుండి నిష్క్రమించింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఛిన్నాభిన్నమైపోయింది. అమెరికాకు ఆ యుద్ధం ముగిసి ఉండవచ్చు, కానీ అమెరికా చేత పెంచి పోషించబడిన ఉగ్రవాదులకు (అఫ్ఘన్ ముజాయిద్దీన్లు) మాత్రం అది అంతమవ్వలేదు. సోవియట్ వ్యతిరేక యుద్ధ సమయంలో సృష్టించబడిన ఈ జిహాదీ వ్యవస్థ (Jihadist Ecosystem) ఆ తర్వాత కూడా మనుగడ సాగించింది. ఎందుకంటే, దీనిని పాకిస్తాన్ నిఘా విభాగం (ISI) రక్షించి, తమ అవసరాలకు తగ్గట్టుగా మలచుకొని పోషించింది. ఆఫ్ఘనిస్తాన్ ఇక ప్రధాన యుద్ధభూమి కాకుండా పోవడంతో, ఈ ఉగ్రవాదులను భారతదేశం అనే కొత్త లక్ష్యం వైపు మళ్లించారు. ముజాహిదీన్ కాలం నాటి ఆ మౌలిక సదుపాయాల నుండే లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇవి అవే భావజాలాన్ని, అదే శిక్షణ పద్ధతులను మరియు అదే అంతర్జాతీయ నెట్‌వర్క్‌లను జమ్మూ కాశ్మీర్ మరియు భారత ప్రధాన భూభాగంలోకి తీసుకువచ్చాయి.
ఈ పరిణామ క్రమంలో అత్యంత కీలకమైన వ్యక్తులలో ఒకడు మసూద్ అజార్. అతని నాయకత్వంలోనే, జైషే మొహమ్మద్ సంస్థ భారత భూభాగంపై అత్యంత దారుణమైన ఉగ్రదాడులను పథకం ప్రకారం అమలు చేసింది. వాటిలో 14 మంది ప్రాణాలను బలిగొన్న 2001 భారత పార్లమెంటు దాడి, 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, మరియు 40 మంది సీఆర్‌పీఎఫ్ (CRPF) జవాన్ల వీరమరణానికి కారణమైన 2019 పుల్వామా ఆత్మహుతిదాడి వంటివి ఉన్నాయి. వీటితో పాటు, 26/11 ముంబై దాడుల ద్వారా లష్కరే తోయిబా తన పూర్తి స్థాయి వినాశకర సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ దాడుల్లో 166 మంది సామాన్య పౌరులు మరియు విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇవి కేవలం విడివిడిగా జరిగిన హింసాత్మక ఘటనలు కావు; ప్రచ్ఛన్న యుద్ధం (Cold War) సమయంలో పురుడుపోసుకున్న ఒక జిహాదీ ప్రాజెక్ట్ యొక్క కొనసాగింపు మాత్రమే.
సోవియట్ వ్యతిరేక యుద్ధం అనే కొలిమిలో పుట్టుకొచ్చిన పాకిస్తాన్ ప్రేరేపిత జిహాదీలు, ఇప్పుడు తమ నగరాలపై మరియు సైనికులపై దాడులు చేస్తున్నారని 1990-2000 దశకాల్లో భారతదేశం అమెరికాను పదేపదే హెచ్చరించింది. అయితే, ఆ హెచ్చరికలను అమెరికా కేవలం ‘ప్రాంతీయ వివాదాలు’ (Regional Disputes)గా కొట్టిపారేస్తూ మామూలు విషయాలుగా తోసిపుచ్చింది.
9/11: ప్రపంచానికి మేల్కొలుపు
దశాబ్దాల పాటు భారతదేశం ఈ యుద్ధాన్ని ఒంటరిగానే పోరాడింది. ప్రపంచమంతా కళ్లు మూసుకుని మౌనంగా ఉన్న సమయంలో, అంతర్జాతీయ సమాజం చూపిన ఆ ఉదాసీనతకు భారతీయ సైనికులు మరియు సామాన్య పౌరులు తమ ప్రాణాలను మూల్యంగా చెల్లించుకున్నారు. సరిహద్దు అవతల శిక్షణ పొంది, అక్కడి ప్రభుత్వ రక్షణలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారి చేతుల్లో వేల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏకాకితనం చాలదన్నట్లు, భారతదేశం తన ఆత్మరక్షణ కోసం అణు పరీక్షలు నిర్వహించినప్పుడు, అమెరికా దానిని అర్థం చేసుకోవాల్సింది పోయి మనపై ఆంక్షలు (Sanctions) విధించింది. తద్వారా భారత్‌ను వ్యూహాత్మకంగా మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇది భారతదేశ ఆధునిక చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటిగా మిగిలిపోయింది.
అయినప్పటికీ, 9/11 దాడులు జరిగే వరకు అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని అమెరికా ఒక పెద్ద ముప్పుగా గుర్తించలేదు. తన అండదండలతో పెరిగిన ముజాహిదీన్లు, కాలక్రమేణా తాలిబన్ మరియు అల్-ఖైదాగా రూపాంతరం చెంది.. తమపైనే దాడి చేస్తారని అమెరికా అస్సలు ఊహించలేదు. సెప్టెంబర్ 11, 2001న వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుప్పకూలి, దాదాపు 3000 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు మాత్రమే.. ఉగ్రవాదానికి ప్రాంతీయ సరిహద్దులు ఉండవని అమెరికా గ్రహించింది. ఆ దాడి జరిగిన సరిగ్గా నెల తర్వాత, అక్టోబర్ 1, 2001న పాకిస్థానీ ఉగ్రవాదులు కాశ్మీర్ అసెంబ్లీని లక్ష్యంగా చేసుకుని 38 మంది సామాన్య పౌరులను బలిగొన్నారు. తొలుత అమెరికాలో, ఆ తర్వాత మళ్ళీ భారతదేశంలో జరిగిన ఈ రక్తపాతం తర్వాత భారత్-అమెరికా సంబంధాలు అనూహ్య మలుపు తిరిగాయి. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి మరియు అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి చేతులు కలిపారు.

వ్యూహాత్మక ప్రయోజనాల మధ్య నెలకొన్న వైరుధ్యం
భారతదేశంతో చేతులు కలిపినప్పటికీ, ఒక వింతైన వైరుధ్యం (Paradox) నేటికీ కొనసాగుతోంది. అమెరికా ఇప్పటికీ పాకిస్థాన్‌తో తన వ్యూహాత్మక సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. చైనాను ఎదుర్కోవడానికి భారతదేశం ఎంత అవసరమో, ‘ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’ (Global War on Terror) కోసం పాకిస్థాన్ మద్దతు కూడా అంతే కీలకమని వాషింగ్టన్ భావిస్తోంది. ఉగ్రవాద సంస్థలను పాకిస్థాన్ తన ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా, ఒక ఆయుధంగా వాడుకుంటోందని భారతదేశం పదేపదే సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నప్పటికీ, అమెరికా మాత్రం తన సొంత భద్రతా ప్రయోజనాల దృష్ట్యా పాకిస్థాన్‌ను పూర్తిగా వదిలిపెట్టడానికి వెనుకాడుతోంది.
అమెరికా పాకిస్థాన్‌ను అంటిపెట్టుకుని ఉండటానికి కారణం కేవలం ఉగ్రవాదం మాత్రమే కాదు. అంతకంటే భయంకరమైన అంశం మరొకటి ఉంది. అదే ‘అణు ఆయుధాలు’ (Nuclear Weapons). ఒకవేళ పాకిస్థాన్ అస్థిరంగా మారితే, అక్కడి అణు నిల్వలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తాయని, అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుందని వాషింగ్టన్ భయపడుతోంది. అందుకే, అమెరికా-పాకిస్థాన్ సంబంధం అనేది స్నేహం కంటే ఎక్కువగా ఒక ‘నిఘా’ (Surveillance) మిషన్ అని చెప్పవచ్చు. 2011లో అబోటాబాద్‌లో ఒసామా బిన్ లాడెన్ దొరికిన తర్వాత కూడా, లేదా హక్కానీ నెట్‌వర్క్‌తో ఐఎస్ఐ (ISI) కి ఉన్న సంబంధాలకు ఆధారాలు లభించినప్పటికీ, పాకిస్థాన్‌ను వదిలి వెళ్లే సాహసం వాషింగ్టన్ చేయలేకపోయింది.
ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సృష్టించబడిన జిహాదీ వ్యవస్థ కనుమరుగు కాలేదు. పైగా అది ఒక క్యాన్సర్‌లా (Metastasised) విస్తరించింది. పాకిస్థాన్ ఆ వ్యవస్థను తన అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నప్పుడు, అది భారత గడ్డపై అంతులేని మానవ విషాదానికి కారణమైంది. 2000వ సంవత్సరంలో భారత్-అమెరికా మధ్య ఏర్పడిన ఉగ్రవాద వ్యతిరేక భాగస్వామ్యం ఆలస్యం కావడానికి కారణం అమెరికాకు విషయం తెలియక కాదు. ఒకవేళ అప్పట్లోనే భారత్ చెప్పినట్లు ఉగ్రవాదంపై పోరాటం మొదలుపెడితే.. “మేము పెంచిన వాళ్ళే ఇప్పుడు ఉగ్రవాదులుగా మారారు” అని అమెరికా ప్రపంచానికి ఒప్పుకోవాల్సి వచ్చేది. అందుకే వారు చాలా కాలం నిరాకరించాల్సి వచ్చిందన్న వాస్తవం..!





